ఆ డబ్బును తిరిగి ఇచ్చేయండి.. పోలీసులకు ఈసీ ఆదేశాలు
పలు చోట్ల సొంత పనుల కోసం సామాన్య ప్రజలు తీసుకెళ్తున్న నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆయా రాజకీయ పార్టీలో డబ్బులు పంచుతాయనే అంచనాలతో నగదు తరలింపుపై ఎన్నికల సంఘం కఠినమైన ఆంక్షలు విధించింది. రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలిస్తే దానికి సంబంధించిన రసీదులు తప్పకుండా చూపించాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు, బంగారం పట్టుబడుతోంది.
అయితే పలు చోట్ల సొంత పనుల కోసం సామాన్య ప్రజలు తీసుకెళ్తున్న నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు విత్‌డ్రా స్లిప్, ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు వదలడం లేదని ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. సరైన ఆధారలు ఇచ్చినా.. తమ నగదును తిరిగి ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న నగదులో ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని అనుకుంటే.. సదరు సొమ్మును వెంటనే యజమానులకు తిరిగి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్ కుమార్ ఆదేశించారు. సొమ్ములు తిరిగి ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించవద్దని ఆయన తెలిపారు.
పోలీసులు చేస్తున్న తనిఖీల వల్ల సామాన్యులను ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని ఆయన సూచించారు. త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా చూడాలని.. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని నితీశ్ కుమార్ చెప్పారు.