Telugu Global
Telangana

ఢిల్లీ మెట్రోలో తీసుకొని వెళ్లే మద్యం పరిమితిపై ఆంక్షలు.. రూల్స్ మార్చాల్సి ఉంటుందన్న ఎక్సైజ్ శాఖ

ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం 25 ఏళ్లు పైబడిన వ్యక్తులు తమతో ఒక లీటర్ మద్యం మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుందని చెప్పింది.

ఢిల్లీ మెట్రోలో తీసుకొని వెళ్లే మద్యం పరిమితిపై ఆంక్షలు.. రూల్స్ మార్చాల్సి ఉంటుందన్న ఎక్సైజ్ శాఖ
X

దేశంలోనే అత్యుత్తమ మెట్రోల్లో ఒకటిగా నిలిచిన ఢిల్లీ మెట్రోలో ఇకపై మద్యం కూడా తీసుకెళ్లేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై సీలు తీయని రెండు బాటిల్స్‌ను ప్రయాణికులు తమతో పాటు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఎయిర్‌పోర్ట్ లైన్‌లో మాత్రమే మద్యం తీసుకొని రావడానికి అనుమతి ఉండగా.. ఇకపై అన్ని మార్గాల్లో మద్యం క్యారీ చేయడంపై ఆంక్షలు ఎత్తివేసింది.

అయితే ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మాత్రం ఈ నిర్ణయంపై ప్రయాణికులకు ఝలక్ ఇచ్చింది. మెట్రో రైలు ఢిల్లీ పరిధిలో కేవలం 1 లీటర్ మద్యం మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం 25 ఏళ్లు పైబడిన వ్యక్తులు తమతో ఒక లీటర్ మద్యం మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఢిల్లీ మెట్రో 2 బాటిల్స్ అని ప్రకటించడం కూడా నిబంధనలకు విరుద్దమని పేర్కొంది. ఒక ఫుల్ బాటిల్ విస్కీ లేదా వోడ్క పరిమాణం 750 మిల్లీ లీటర్లు ఉంటుంది. రెండు ఫుల్ బాటిల్స్ అంటే 1.5 లీటర్లు అవుతుంది. ఇది ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనలకు విరుద్దమని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఢిల్లీకి ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వాళ్లు 1 లీటర్ మద్యం తెచ్చుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి. కానీ, ఢిల్లీ మెట్రో తీసుకున్న నిర్ణయం ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎక్సైజ్ శాఖను సంప్రదించలేదని కూడా తెలిపారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ, ఢిల్లీ మెట్రో అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అప్పటి వరకు కేవలం 1 లీటర్ మద్యం మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది.

అయితే హర్యానా పరిధిలోకి వచ్చే గుర్‌గావ్, యూపీ పరిధిలోకి వచ్చే నోయిడా పరిధిలో మాత్రం రెండు బాటిల్స్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ గందరగోళంపై డీఎంఆర్‌సీ కూడా క్లారిటీ ఇచ్చింది. మెట్రో రైలులో ఎలాంటి వస్తువులను ప్రయాణికులు తమ వెంట తీసుకొని వెళ్లవచ్చనే విషయంపై తమ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక నివేదిక ఇచ్చిందని.. దాని ప్రకారమే భద్రతకు భగం కలిగించని వాటిలో ఒకటైన సీల్డ్ మద్యాన్ని అనుమతించామని అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంలో ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలోనే ఈ గందరగోళానికి తెరపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ మెట్రోలో ట్రావెల్ చేసే ప్రయాణికులు రాష్ట్ర ఎక్సైజ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యాన్ని అక్రమంగా తరలించ వద్దని కూడా కోరుతున్నారు. ఈ క్రమంలో నోయిడా అధికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ మెట్రోలో ఒక సీల్డ్ బాటిల్ మద్యం మాత్రమే ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకొని వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

First Published:  25 July 2023 11:21 AM IST
Next Story