Telugu Global
Telangana

సొంత ఆదాయంలో తెలంగాణ భేష్‌.. ధరణి, వెహికిల్‌ ట్యాక్స్ కీలకం..!

తెలంగాణలో తెచ్చిన వివిధ పన్ను సంస్కరణలను RBI తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు స్టాంపు డ్యూటీలను ప్రభుత్వం సవరించింది.

సొంత ఆదాయంలో తెలంగాణ భేష్‌.. ధరణి, వెహికిల్‌ ట్యాక్స్ కీలకం..!
X

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు తన తాజా నివేదికలో అనేక విషయాలు వెల్లడించింది. ప్రధానంగా ధరణి పోర్టల్‌, వెహికిల్‌ ట్యాక్స్‌ రాష్ట్ర ఆదాయానికి కీలకంగా మారాయని తెలిపింది. సొంత పన్నుల ద్వారా ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఆదాయంలో సొంత పన్నుల ద్వారా 86.9 శాతం పొందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఫస్ట్ ప్లేసులో ఉండగా.. 84.2 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని RBI తన నివేదికలో పేర్కొంది.

తెలంగాణలో తెచ్చిన వివిధ పన్ను సంస్కరణలను RBI తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు స్టాంపు డ్యూటీలను ప్రభుత్వం సవరించింది. వాహనాల నుంచి వచ్చే పన్ను రాబడిలోనూ మార్పులు చేసింది. వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ను వివిధ కేటగిరీల్లో పెంచింది. వెహికిల్ ట్యాక్స్ ఎగవేతదారులను గుర్తించి.. 200 శాతం వరకు పెనాల్టీలు విధించడం ద్వారా రాబడిని పెంచుకుంది. GST ఆదాయం పెంపుకోసం సంస్కరణలు తీసుకువచ్చింది. ఎగవేతదారులు, తక్కువ ట్యాక్స్ చెల్లించేవారిని గుర్తించేందుకు స్టేట్ GST విభాగం స్పెషల్ వింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇక పన్నేతర రాబడి కోసం భూములను వేలం వేసింది.

RBI నివేదిక ప్రకారం.. జీఎస్టీకి ముందు 2015-16, 2016-17 మధ్యకాలంలో సొంత పన్నుల ద్వారా రాబడిలో 76.4 శాతం తెలంగాణ ఐదో స్థానంలో ఉండేది. తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కోవిడ్‌ ముందు అంటే 2018-19, 2019-20 నాటికి మొత్తం ఆదాయంలో 79.5 శాతం సొంత పన్నుల ద్వారానే సమకూర్చుకుని తెలంగాణ మూడో ర్యాంకుకు చేరింది.

2024 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,89 వేల 672 కోట్లకు చేరనున్నాయని RBI వెల్లడించింది. GSDPలో 27.8 శాతంగా అప్పులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం అప్పుల్లో ఏడాదిలోపే చెల్లించాల్సినవి 3.6 శాతం ఉండగా.. ఏడాది, ఐదేళ్లలోపు చెల్లించాల్సిన అప్పులు 26.5 శాతం ఉన్నాయి. ఐదేళ్లపైన, పదేళ్లలోపు చెల్లించాల్సిన అప్పులు 11.5 శాతంగా ఉన్నాయి. 10-20 ఏళ్లలోపు చెల్లించాల్సినవి 37.5 శాతం, 20 ఏళ్ల తర్వాత చెల్లించాల్సిన అప్పులు 21 శాతంగా ఉన్నాయి.

First Published:  15 Dec 2023 7:22 AM GMT
Next Story