ఆయనకు జగన్ తెలియదు.. ఈవిడకు షర్మిల తెలియదంట..
రేపు షర్మిల కాంగ్రెస్ లో చేరి, ఖమ్మం నుంచి పోటీ చేస్తే, అప్పుడు కూడా రేణుకా చౌదరి ఇలాగే మాట్లాడతారా..? షర్మిలతో కలసి పనిచేయాల్సి వస్తే, కలసి ప్రచారం చేయాల్సి వచ్చినా కూడా రేణుక ఇంతే వెటకారం ప్రదర్శించగలరా..?
రాజకీయ నాయకుల్లో కొన్ని సార్లు వెటకారం పాళ్లు ఎక్కువవుతాయి. అలాంటి సందర్భాల్లో వాళ్లు చేసే వ్యాఖ్యలు కామెడీగా అనిపించినా తర్వాతి కాలంలో వారికే రివర్స్ లో తగులుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ షర్మిలపై రేణుకా చౌదరి చేసిన వెటకారం దీనికి తాజా ఉదాహరణ. షర్మిల ఎవరో తనకు తెలియదంటూ రేణుగా చౌదరి మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేస్తుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె వెటకారంగా సమాధానమిచ్చారు. షర్మిల అంటే ఎవరని ఎదురు ప్రశ్నించారు.
తెలుసుకునే రోజు రాదా..?
షర్మిల కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్ పెద్దల కన్ఫర్మేషన్ తోపాటు, షర్మిల-రాహుల్ ట్వీట్లు ఈ విషయాన్ని స్ఫష్టం చేస్తున్నాయి. రేపు షర్మిల కాంగ్రెస్ లో చేరి, ఖమ్మం నుంచి పోటీ చేస్తే, అప్పుడు కూడా రేణుకా చౌదరి ఇలాగే మాట్లాడతారా..? షర్మిలతో కలసి పనిచేయాల్సి వస్తే, షర్మిలతో కలసి ప్రచారం చేయాల్సి వచ్చినా కూడా రేణుక ఇంతే వెటకారం ప్రదర్శించగలరా..? రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, అయితే రేణుకా చౌదరి లాంటి వాళ్లు మాత్రం అప్పుడప్పుడు ఇలా నోరుజారుతుంటారు, అవతల తీరిగ్గా నాలిక కరుచుకుంటారు. వైఎస్ఆర్ హయాంలో ఆయన దయతో కేంద్ర మంత్రి అయిన రేణుకా చౌదరి లాంటి వారికి కూడా షర్మిల ఎవరో తెలియదంటే.. అది అజ్ఞానమా, అహంకారమా అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
అప్పట్లో కేకే కూడా..
అప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కూడా గతంలో ఇలాగే జగన్ విషయంలో వెటకారం చేశారు. జగన్ అంటే ఎవరు రాజశేఖర్ కొడుకా అంటూ గతంలో విలేకరులతో మాట్లాడుతూ సెటైర్లు వేశారు కేశవరావు. అక్కడ సీన్ కట్ చేస్తే, ఏపీ సీఎంగా జగన్ తెలంగాణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ తరపున కేశవరావు కూడా స్వాగతం పలకాల్సి వచ్చింది. అంతకు ముందు తెలియని జగన్ గురించి అప్పుడాయనకు బాగానే తెలిసొచ్చింది.