కమ్మోళ్లు కోపంగా ఉన్నారు.. కాంగ్రెస్ అధిష్టానానికి వార్నింగ్
పార్టీలో సామాజిక న్యాయం జరగటం లేదని.. బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. కమ్మ కులాన్ని గుర్తించాలని, ఇప్పటికే కాంగ్రెస్ పై కమ్మ కులస్తులు కోపంగా ఉన్నారని, ఉద్రేకంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
మా జనాభా ఎక్కువగా ఉంది, కనీసం లోక్ సభ పరిధిలో రెండు సీట్లయినా ఇవ్వండి అంటూ బీసీలు కాంగ్రెస్ అధిష్టానాన్ని బతిమిలాడుకుంటున్నారు. కాదు కుదరదు అంటూ పెద్ద తలకాయలు తాత్సారం చేస్తున్నారు. ఈ క్రమంలో కమ్మ కులస్తులు కూడా ఓ మీటింగ్ పెట్టుకున్నారు, కానీ వారు అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలసిన అనంతరం రేణుకా చౌదరి.. కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో సామాజిక న్యాయం జరగటం లేదని.. బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. కమ్మ కులాన్ని గుర్తించాలని, ఇప్పటికే కాంగ్రెస్ పై కమ్మ కులస్తులు కోపంగా ఉన్నారని, ఉద్రేకంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
దమ్మున్నవారికి కూడా ఇవ్వండి..
డబ్బున్న వాళ్లకే కాదు.. దమ్మున్న వాళ్లకి కూడా పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరారు రేణుకాచౌదరి. కమ్మ కులం వాళ్ల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలిపారామె. పిల్లికి బిచ్చం వేసినట్లు సీట్లు ఇస్తామంటే కుదరదని అన్నారు. ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తామంటే కుదరదని, తమ కులాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. అదే విషయాన్ని తాను హైకమాండ్ కి చెప్పినట్టు తెలిపారు.
అన్నీ వారికేనా..?
గత ఎన్నికల్లో 38 సీట్లు ఒకే వర్గానికి కాంగ్రెస్ ఇచ్చిందంటూ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి అధిక సీట్లు ఇస్తే.. అందరూ కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారన్నారు. మిగతా పార్టీల వాళ్లు కమ్మోళ్లకు పిలిచి టికెట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మవారి ఐక్య వేదిక నేతలంతా హైకమాండ్ ని కలసి తమకు 12 టికెట్లయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.