Telugu Global
Telangana

బడి బాట షెడ్యూల్ విడుదల.. విద్యార్థుల నమోదుపై అధికారుల దృష్టి

బడి బాట కార్యక్రమం ద్వారా అత్యధికంగా విద్యార్థుల అడ్మిషన్లు చేయించిన టాప్-3 జిల్లాలు, టాప్-10 పాఠశాలలను గుర్తించి.. వారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని శ్రీదేవసేన పేర్కొన్నారు.

బడి బాట షెడ్యూల్ విడుదల.. విద్యార్థుల నమోదుపై అధికారుల దృష్టి
X

పాఠశాలల రీఓపెనింగ్ దగ్గర పడుతుండటంతో బడిబాట షెడ్యూల్, మార్గదర్శకాలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా జూన్ 3 నుంచి 'ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల విద్యాధికారులకు పంపించారు. ఈ సారి ఎక్కువ మంది విద్యార్థులను నమోదు చేసే డీఈవో, ఎంఈవో, టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు.

రాష్ట్రంలో బడి బాట కార్యక్రమం ద్వారా అత్యధికంగా విద్యార్థుల అడ్మిషన్లు చేయించిన టాప్-3 జిల్లాలు, టాప్-10 పాఠశాలలను గుర్తించి.. వారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని శ్రీదేవసేన పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 31లోపు జిల్లా స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. జూన్ 1న మండల, జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 12 నుంచి 17 వరకు షెడ్యూల్ ప్రకారం బడుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీదేవసేన సూచించారు.

జిల్లా, మండల స్థాయిలో బడిబాట హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ రోజువారీ ఎన్‌రోల్‌మెంట్ వివరాలు నమోదు చేస్తారు. బడి బయట చిన్నారులను గుర్తించేందుకు స్వయం సహాయక బృందాల సహకారాన్ని తీసుకోనున్నారు. సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచడం, ప్రభుత్వ బడులకు పిల్లలు వచ్చేలా చూడటంతో పాటు పౌర సమాజాన్ని భాగస్వామ్యం కూడా చేసేందుకే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

షెడ్యూల్ ఇలా..

- జూన్ 3 నుంచి జూన్ 9 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

- జూన్ 12న మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి కార్యక్రమం

- జూన్ 13న తొలి మెట్టు

- జూన్ 14న సామూహిక అక్షరాభ్యాసం

- జూన్ 15న చిన్నారులు, బడి బయట ఉన్న విద్యార్థుల నమోదు కార్యక్రమం

- జూన్ 16 పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై అవగాహన

- జూన్ 17 బాలికల విద్య, కెరియర్ గైడెన్స్

First Published:  29 May 2023 11:30 PM GMT
Next Story