Telugu Global
Telangana

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయండి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖ

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయండి
X

15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గురువారం లేఖ రాశారు. ఎనిమిది నెలలుగా పంచాయతీలకు ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు విడుదల చేయకపోడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని, పారిశుధ్య నిర్వహణ అధ్వనంగా మారిందన్నారు. గ్రామాలు మురికి కూపాలుగా మారాయని, ట్రాక్టర్లలో డీజిల్‌ పోయిండానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. నిధులు లేక గ్రామాల్లో పాలన ఆగిపోయిందని, చెత్త సేకరణ నిలిచి పోయిందని, స్ట్రీట్‌ లైట్లు వెలగడం లేదన్నారు. ఫాగింగ్‌ చేయడం లేదని, బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా చల్లలేని దుస్థితిలో గ్రామాలు ఉన్నాయని.. ప్రజలు మలేరియా, డెంగీ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ఆర్థిక భారం మోయలేక పంచాయతీ సెక్రటరీలు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని తెలిపారు. పెండింగ్‌ బిల్లుల కోసం మాజీ సర్పంచులు గవర్నర్‌ ను కలిసి మొర పెట్టుకున్నారని, అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులకు మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1,200 కోట్లు కేటాయించినా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ఉపాధి నిధుల వినియోగానికి సంబంధించి ఈనెలాఖరులోపు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుందని, యూసీలు ఇవ్వకుంటే రెండో విడత నిధులు కూడా రావన్నారు. అదే జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. పంచాయతీ కార్మికుల వెతలను అర్థం చేసుకొని నిధులు విడుదల చేయాలని కోరారు. కనీసం దసరా, దీపావళి పండుగలకైనా వారికి జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలని సూచించారు.

First Published:  26 Sept 2024 5:28 PM IST
Next Story