కాంగ్రెస్ నేతల భూముల కోసం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చుతున్నరు
ఇందులో బిగ్ బ్రదర్స్ హస్తం ఉన్నది : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్ నేతల భూముల కోసం రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) అలైన్‌మెంట్ మార్చుతున్నారని, ఇందులో బిగ్ బ్రదర్స్ హస్తం ఉందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతోఎ మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్పుతో రేవంత్ సర్కార్ భూదందాలకు తెరలేపుతుందన్నారు. కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించారని తెలిపారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ గతంలోనే ఖరారు చేసినా అప్రూవ్ చేయలేదని, దీన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూముల్లోంచి ఈ రోడ్డు వేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు వేయడానికి కేంద్రం రూ.12,500 కోట్లు, రాష్ట్రం రూ.2,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. సాగర్ రోడ్ లో గొల్లపల్లికి దూరంగా, శ్రీశైలం రోడ్డులో నాలుగు కి.మీ.లు దూరంగా అలైన్‌మెంట్ మార్చారని తెలిపారు. ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసమే అలైన్‌మెంట్ మార్చుతున్నామని అంటున్నారని.. ఫోర్త్ సిటీ పాత అలైన్‌మెంట్ కు 10 కి.మీ.ల దూరంలో ఉంటే.. ఇప్పుడు మార్చిన అలైన్‌మెంట్ తో 12 కి.మీ.ల దూరం పెరిగిందన్నారు.
అమన్ గల్ వద్ద 400 ఎకరాల కుందారం భూములను పేదలు సాగు చేసుకుంటున్నారని, బిగ్ బ్రదర్స్ అక్కడి రాజవంశీయులతో బేరం చేసుకొరని పేదలను వెళ్లగొట్టి ఆ భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. జనవరి నుంచే రైతులతో కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారని, ఇలాంటి ఒప్పందాలను తెలంగాణలో మొదటిసారి చూస్తున్నామన్నారు. మాడుగుల గ్రామం సీఎం బంధువులదని.. అక్కడ ఏం జరుగుతోందో అందరికీ తెలుసన్నారు. చేవెళ్ల రోడ్డులో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు అలైన్‌మెంట్ మార్చారు, అక్కడ ఒక ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు ఉన్నాయని చెప్తున్నారని అన్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ నాలుగు చోట్ల మార్చడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలన్నారు. అలైన్‌మెంట్ మార్పుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అలైన్‌మెంట్ మార్చుతూ పోతే కేంద్రం ఈ ప్రాజెక్టును టేకప్ చేయకపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి రీజినల్ రింగ్ రోడ్డు చేపట్టాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ఉందన్నారు. వెంటనే పాత అలైన్‌మెంట్ తోనే రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అక్రమాలు వెలుగు చూడాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సీబీఐ విచారణకు ఆదేశించకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని భావించాల్సి వస్తుందన్నారు.