మా నాయకులను తిట్టినప్పుడు సజ్జలకు బాధ అనిపించలేదా? : రెడ్కో చైర్మన్ వై. సతీశ్ రెడ్డి
రాష్ట్ర మంత్రులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టినప్పుడు సజ్జలకు బాధ అనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. చివరకు మహిళా ఎమ్మెల్సీ అయిన కవితపై కూడా షర్మిల కారుకూతలు కూశారని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, నాయకులపై వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదని, అప్పుడు ఆయనకు బాధ అనిపించలేదా అని తెలంగాణ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం బాధించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సతీశ్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పట్టుకొని 420 ముఖ్యమంత్రి అని, మగతనం లేదా మగాళ్లు కాదా అని తీవ్ర పదజాలంతో షర్మిల మాట్లాడినప్పుడు ఈ వైసీపీ నేతలు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర మంత్రులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టినప్పుడు సజ్జలకు బాధ అనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. చివరకు మహిళా ఎమ్మెల్సీ అయిన కవితపై కూడా షర్మిల కారుకూతలు కూశారని గుర్తు చేశారు. వైఎస్ షర్మిల పబ్లిసిటీ కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని సతీశ్ ఆరోపించారు.
తెలంగాణ నాయకులను ఇలా తిడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పారు. ఇన్ని రోజులు ప్రజలు సహనంతో ఉన్నారని.. అయినా సరే షర్మిల శృతి మించి మాట్లాడటంతోనే నర్సంపేటలో ఆ ఘటన జరిగిందని సతీశ్ అన్నారు. నర్సంపేటలో తప్పుగా మాట్లాడిన షర్మిల.. దాన్ని కప్పిపుచ్చుకొని పబ్లిసిటీ చేసుకుందామనే ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర హంగామాకు ప్రయత్నించిందని ఆరోపించారు. షర్మిల దూకుడు వ్యవహార శైలి కారణంగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారని సతీశ్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర విమర్శలు చేసినప్పుడే ఆమెకు మీరో, మీ సీఎం జగనో బుద్ది చెప్పి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు కదా అని సజ్జలకు సూచించారు. ఇప్పటికైనా ఆమెకు ఎలా మాట్లాడాలో నేర్పించాలని సలహా ఇచ్చారు. ఇలాంటి సంఘటనే ఏపీలో జరిగి ఉంటే వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా లాఠీచార్జి చేసి ఆసుపత్రిలో జాయిన్ చేసేదన్నారు. టీవీ డిబేట్లలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకుల పట్ల ఎలా వ్యవహరించారో ఇప్పటికీ గుర్తుందని చెప్పారు.
తెలంగాణ పోలీసులు చాలా ఓపికతో వ్యవహరించారని.. ఆమెను బతిమిలాడినా షర్మిల అక్కడి నుంచి వెళ్లలేదన్నారు. అందుకే కారుతోపాటు అరెస్టు చేసి తీసుకొని వెళ్లాల్సి వచ్చిందన్నారు. దీనిపై వైసీపీ నేతలు రాజకీయ స్టేట్‌మెంట్లు ఇవ్వడం మానుకోవాలని సతీశ్ రెడ్డి సూచించారు.