Telugu Global
Telangana

వాతావరణ శాఖ హెచ్చరిక.. పొలాల్లో సెల్ ఫోన్ వాడొద్దు

ప్రస్తుతం తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.

వాతావరణ శాఖ హెచ్చరిక.. పొలాల్లో సెల్ ఫోన్ వాడొద్దు
X

భారీ వర్షాల్లో కూడా కొన్నిసార్లు పొలానికి వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులు రైతులకు ఏర్పడతాయి. పశువులకోసం, లేదా పంట పరిస్థితిని అంచనా వేయడానికి రైతులు పొలాల్లోకి వెళ్తుంటారు. అయితే వర్షం పడే సమయంలో లేదా ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు పొలంలో సెల్ ఫోన్ అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు. వర్షంలో ఆరుబయట సెల్ ఫోన్ మాట్లాడితే పిడుగులను ఆకర్షించే అవకాశముంటుందని చెబుతున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, కరెంటు స్తంభాల కింద నిలబడవద్దని సూచించారు. పిడుగులు పడుతున్నాయనే అనుమానం వస్తే నేలపై కూర్చోవాలని చెప్పారు.

వాయు'గండం'..

ప్రస్తుతం తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

నిజామాబాద్, వరంగల్ లో అత్యథికం..

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్‌ జిల్లా వెల్పూర్‌ లో అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిశాయి.

అధికార యంత్రాంగం అప్రమత్తం..

భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. వర్షాలకు చెరువులు, జలపాతాల వైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావాలని సూచించారు. మంత్రులు ఎక్కడికక్కడ అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి అంచనా వేస్తున్నారు.

First Published:  26 July 2023 7:35 AM IST
Next Story