4 జిల్లాలకు కొత్తగా రెడ్ అలర్ట్.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
ఈ రోజు నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు గోదావరి ఉరలకెత్తుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. కొత్తగా మరో నాలుగు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఐదు రోజులు రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలు..
భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట
ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు..
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మల్కాజ్ గిరి, కామారెడ్డి
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..
భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుంచి 9,32,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపుకి గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం పట్టణంలోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తోంది. సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని మళ్లీ గోదావరిలోకే రివర్స్ పంపింగ్ చేస్తున్నారు.