'గవర్నర్ తమిళసై ని రీకాల్ చేయండి '
తెలంగాణ గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఊపందుకున్నాయి. గవర్నర్ గా తెలంగాణ లో మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె రాజభవన్ లో చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీపీఐ నేత నారాయణ కూడా గవర్నర్ తీరుపై మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. ఆమె గురువారంనాడు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పరిమితులు దాటి రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా గవర్నర్ తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గవర్నర్ గా కంటే రాజకీయ నాయకురాలిగా వ్యాఖ్యాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
టిఆర్ ఎస్ నాయకులతో పాటు సిపిఐ నుంచి విమర్శలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సిపిఐ) జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మట్లాడుతూ గవర్నర్ తమిళసై తన పరిధులు అతిక్రమిస్తున్నారని అన్నారు. ఆమె లక్ష్మణ రేఖను దాటారని గతంలోనే చెప్పాను. రోజురోజుకీ ఆమె తన పరిమితులను మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే గవర్నర్ తమిళసైను రీకాల్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. .
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ప్రత్యేకించి అదానీకి, అంబానీకి అప్పగిస్తోందని ఆయన ఆరోపించారు. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలు చేసే ఏ గవర్నర్ అయినా పనికిమాలిన గవర్నరేనని నారాయణ సంచలన వ్యాఖ్య చేశారు.
తెలంగాణలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ పైనే విమర్శలకు దిగారు.
గవర్నర్ గా తెలంగాణ లో మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె రాజభవన్ లో చేసిన వ్యాఖ్యల పట్ల టిఆర్ ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వీరయ్య అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతూ గవర్నర్ పదవి గౌరవాన్ని దిగజారుస్తున్నారని విమర్శించారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా.. ఒక్క పథకమైనా అమలు చేయించగలరా అని ఆయన గవర్నర్ ను ప్రశ్నించారు. రాజభవన్ ను బిజెపికి అనుబంధంగా మార్చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గవర్నర్ బిజెపి నాయకురాలిగా మాట్లాడుతున్నారు. ఆమె తన పని తాను చేసుకోవాలి అని అన్నారు. పరిధులు దాటి ప్రవర్తించడం ఆమె హోదాకు తగదన్నారు.ఎంఎల్ సి కవిత మాట్లాడుతూ.. గవర్నర్ తన హోదాకు తగ్గట్టు వ్యవహరించడంలేదని, ఏదో చేయాలనే దుగ్ధ కనబడుతోందన్నారు. తెలంగాణలో ఏదో చేయాలనుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా, గవర్నర్ తమిళసై తీరు విమర్శలకు, వివాదాలకు గురవుతోంది.