Telugu Global
Telangana

తెలంగాణను పునర్మించడం అంటే.. సకల జీవరాశులను సంరక్షించడం : మంత్రి కేటీఆర్

ప్రతీ పల్లె పచ్చదనంతో మురిసిపోతోంది. ప్రతీ పట్నంలో హరిత శోభ వెల్లివిరుస్తోంది. ఆగమైన అడవి చుట్టూ పచ్చని పందిరి అల్లుకుంటోందని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణను పునర్మించడం అంటే.. సకల జీవరాశులను సంరక్షించడం : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు.. ధ్వంసమైన అడవులను పునరుద్దరించడం, సకల జీవరాశులను సంరక్షించడం అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. ఇప్పుడు ఆ విషయాన్ని యావత్ భారతదేశానికి చాటిపెట్టిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెరుగుతున్న పచ్చదనం, జీవవైవిధ్యంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

వానలు వాపసు రావాలె.. కోతులు వాపసు పోవాలె అనే మహోన్నత లక్ష్యం నెరవేరుతోంది. ప్రతీ పల్లె పచ్చదనంతో మురిసిపోతుంది. ప్రతీ పట్నంలో హరిత శోభ వెల్లివిరుస్తోంది. ఆగమైన అడవి చుట్టూ పచ్చని పందిరి అల్లుకుంటోందని కేటీఆర్ చెప్పారు. ప్రకృతి విపత్తులను అరికట్టాలన్నా.. పర్యవరణ సమతుల్యత సాధించాలన్నా.. ఆపదలో ఉన్న అటవీ సంపదను కాపాడాలన్నా.. మానవ జాతి చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మస్త్రం హరితహారం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు గురైన అటవీ రంగాన్ని తెలంగాణ ప్రాధాన్యతగా తీసుకున్నది. అడవులకు తిరగి ఆక్సిజన్ అందించి ప్రాణం పోసింది సీఎం కేసీఆర్ అన్నారు. జంగిల్ బచావో.. జంగిల్ బడావో నినాదాన్ని సీఎం కేసీఆర్ అక్షరాలా నిజం చేశారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పుడు హరిత హారం కూడా మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని కేటీఆర్ చెప్పారు.

భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే వారసత్వ సంపద కాంక్రీట్ జంగిళ్లు కాదని.. పచ్చని అడవులని గుర్తు చేసే గొప్ప సందర్భమే హరితోత్సవం అని కేటీఆర్ చెప్పారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా.. గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రకృతి ప్రేమికులందరికీ తన హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలను మంత్రి కేటీఆర్ తెలియజేశారు.



First Published:  19 Jun 2023 2:41 PM IST
Next Story