Telugu Global
Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకుల తిరుగుబాటు

కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని సింగిల్ విండో వైస్ చైర్మన్ వావిళ్ల సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. దీని వెనుక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకుల తిరుగుబాటు
X

అధికార టీఆర్ఎస్‌‌కు చెందిన ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేయడం కలకలం సృష్టిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యవహార శైలితో విసిగిపోయి రాజీనామా చేస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండల ఎంపీపీ విజయతో పాటు ఆరుగురు సర్పంచ్‌లు తమ రాజీనామా లేఖలను మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు భూపతిరెడ్డికి పంపించారు. ఒకే సారి ఇంత మంది నాయకులు రాజీనామాలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో తనకు అన్యాయం జరిగిందని సింగిల్ విండో వైస్ చైర్మన్ వావిళ్ల సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. దీని వెనుక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. సీనియర్ అయిన తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆవేదనతో రాజీనామా చేశారు. ఇదే విషయంలో సంజయ్ కుమార్‌కు మద్దతుగా రాజీనామాల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన వైఖరికి నిరసనగానే రాజీనామాలు చేస్తున్నట్లు ఎంపీపీతో పాటు ఆరుగురు సర్పంచ్‌లు అంటున్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అంటున్నారు.

ఒకేసారి ఇంత మంది రాజీనామాలు చేయడంతో కల్వకుర్తి టీఆర్ఎస్‌లో ఆందోళన నెలకొంది. వెంటనే ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు భూపతిరెడ్డి చెప్పారు. తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరుతున్నారు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని.. అందరం ఏకతాటిపై నిలవాలని పార్టీ నాయకులకు చెప్తున్నారు.

కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన జైపాల్.. అదే పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జైపాల్ ఓడిపోయారు. కానీ గత ఎన్నికల్లో కల్వకుర్తిలో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరులో జైపాల్ యాదవ్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో తరచూ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ సమయంలో టీఆర్ఎస్ నాయకత్వం అంతా జైపాల్ వెంటే ఉంది. కానీ అకస్మాతుగా సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేయడంతో జైపాల్ యాదవ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఇటీవల నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లేలా చేసుకోవడంతో స్థానిక నాయకత్వం అసంతృప్తితో ఉంది. పైగా తన అనుచరులకే ముఖ్యమైన పదవులు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రాజీనామాలతో పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. కాగా, ఇప్పటికే జైపాల్ యాదవ్ విషయం అధిష్టానం దృష్టికి వచ్చిందని.. హైకమాండ్ సూచనతోనే ఆదివారం భూపతిరెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రాజీకి వస్తారా లేదంటే మరింత రచ్చ చేస్తారా అన్నది వేచి చూడాలి.

First Published:  18 Sept 2022 10:51 AM IST
Next Story