ప్రభాస్ సినిమాకు సమస్యలు.. మరి బీజేపీ నేతలెక్కడ?
బాహుబలి ఘన విజయం తర్వాత కృష్ణంరాజు, ప్రభాస్ ప్రధానమంత్రి మోడీని కలవగా.. ప్రధాని ఆ సందర్భంగా ప్రభాస్ కు అభినందనలు తెలిపారు. ముఖ్య నేతలు అమిత్ షా, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ అప్పట్లో ప్రభాస్ ను అభినందించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మావోడు అని చెప్పుకోవడానికి బీజేపీ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒకప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. దీంతో కృష్ణంరాజు కుటుంబానికి బీజేపీ అగ్ర నేతలకు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. బాహుబలి సినిమా ఇండియా లెవెల్ లో భారీ హిట్ కావడంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ప్రభాస్ తో దగ్గర అయ్యేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
బాహుబలి ఘన విజయం తర్వాత కృష్ణంరాజు, ప్రభాస్ ప్రధానమంత్రి మోడీని కలవగా.. ప్రధాని ఆ సందర్భంగా ప్రభాస్ కు అభినందనలు తెలిపారు. ముఖ్య నేతలు అమిత్ షా, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ అప్పట్లో ప్రభాస్ ను అభినందించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో నటించగా.. ఆ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సెట్స్ కు వెళ్లి ప్రభాస్ తో భేటీ అయ్యారు.
ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు ప్రభాస్ ను కలసి పరామర్శించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ప్రభాస్ తాజాగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో రాముడు, ఆంజనేయుడు, రావణుడు పాత్రలను తప్పుగా చిత్రీకరించారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఢిల్లీ కోర్టు ప్రభాస్ కు నోటీసులు కూడా జారీ చేసింది.
ఆదిపురుష్ తో సమస్యల్లో చిక్కుకున్న ప్రభాస్ కు బీజేపీ నాయకులు అండగా నిలుస్తారని ఆయన ఫ్యాన్స్ భావించగా.. అనూహ్యంగా ఆ పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆ పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ కు చెందిన మంత్రి నరోత్తమ్, బీజేపీ నాయకురాలు మాళవిక అవినాష్ ఆదిపురుష్ సినిమాపై తీవ్ర విమర్శలు చేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభాస్ క్రేజ్ ని తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసిన బీజేపీ నాయకులు.. ప్రస్తుతం ప్రభాస్ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.