Telugu Global
Telangana

రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. లండన్ వ్యాఖ్యల కలకలం

రేవంత్‌ రెడ్డి లాంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని అన్నారు కేటీఆర్. పాతికేళ్లుగా తెలంగాణకోసం నిలబడ్డామని, రేవంత్ రెడ్డి లాంటి వారెందరినో బీఆర్ఎస్ మట్టికరిపించిందని గుర్తు చేశారు.

రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. లండన్ వ్యాఖ్యల కలకలం
X

బీఆర్ఎస్ గుర్తు కనపడకుండా 100 మీటర్ల లోతులో తొక్కి పెడతానంటూ లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరల్ కావడంతో.. బీఆర్ఎస్ నేతలు రేవంత్ ని టార్గెట్ చేశారు. అధికారం శాశ్వతం కాదని, మరీ అంత అహంకారం పనికి రాదని హితవు పలికారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకు రావాలి కానీ.. అసంబద్ధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వచ్చిన అవకాశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వినియోగించుకుని ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలతో అహంకారం ప్రదర్శిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, దానం నాగేందర్‌.


చాలామందిని చూశాం..

రేవంత్‌ రెడ్డి లాంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని అన్నారు కేటీఆర్. పాతికేళ్లుగా తెలంగాణకోసం నిలబడ్డామని, రేవంత్ రెడ్డి లాంటి వారెందరినో బీఆర్ఎస్ మట్టికరిపించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ని 100 మీటర్ల లోపల పాతిపెట్టడం కాదని, 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను ముందు పట్టించుకోవాలని హితవు పలికారు. "తెలంగాణ జెండాను ఎందుకు పాతిపెడతావ్? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?" అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్‌.


రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే..

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేగా రేవంత్ రెడ్డి మారుతారని చెప్పారు కేటీఆర్. ఆయన రక్తమంతా బీజేపీదేనన్నారు. తెలంగాణలో రేవంత్ చోటా మోదీగా మారారని, డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఈరోజు తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. నేతలతో సమీక్ష అనంతరం కేటీఆర్.. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

First Published:  20 Jan 2024 3:24 PM IST
Next Story