Telugu Global
Telangana

ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీజేపీలతో ఎక్కడైనా చర్చకు సిద్ధం : మంత్రి జగదీశ్ రెడ్డి

నిరుద్యోగ మార్చ్ అంటూ తెలంగాణలో హడా విడి చేయడం అంటే.. నిరుద్యోగ యువతను ఆ రెండు పార్టీలు వంచనకు గురి చేయడమే అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీజేపీలతో ఎక్కడైనా చర్చకు సిద్ధం : మంత్రి జగదీశ్ రెడ్డి
X

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినన్ని ఉద్యోగ నియామకాలు మరే రాష్ట్రంలోనూ జరగలేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ రెండు పార్టీలు లేనిపోని నిందలు వేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. సూర్యాపేట‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన‌ జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గత పదేళ్ల నుంచి కనీసం 10 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయారని మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగాలివ్వడం చేత కాదు కానీ.. నిరుద్యోగ మార్చ్ అంటూ తెలంగాణలో హడావిడి చేయడం మాత్రం తెలుసు. ఇది తెలంగాణలోని నిరుద్యోగ యువతను వంచనకు గురి చేయడమే అని మంత్రి అన్నారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సి వస్తే.. అది ఇక్కడ కాదని.. ఢిల్లీలో చేయాలని మంత్రి సూచించారు. ఆ రెండు పార్టీల నాయకులు ఇక్కడ చేసేది రాజకీయ నిరుద్యోగ మార్చ్ అంటూ ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఈ మార్చ్ నిర్వహించాలని జగదీశ్ రెడ్డి అన్నారు. అసలు ఉద్యోగాలివ్వడం తర్వాత సంగతి.. ఏడాదికి రెండు లక్షల మంది ఉద్యోగులను వీధిన పడేసిన ఘనత ప్రధాని మోడీది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాక ఎప్పుడో దిక్కుమాలిన పార్టీగా మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నది నాలుగే ఈకలని మంత్రి ఎద్దేవా చేశారు. ఆ నాలుగు ఈకలు కూడా ఎవరిగోలలో వారే ఉన్నారని సెటైర్ వేశారు.

ఇక బీజేపీ పార్టీవి అన్నీ క్షుద్ర రాజకీయాలని పేర్కొన్నారు. వారి రాజకీయాల్లో లీకేజీలు కూడా ఒక భాగమని ఆరోపించారు. దేశాన్ని ఏలుతున్న పార్టీకి.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లీకేజీ వ్యవహారంలో అడ్డంగా దొరికపోయాడని అన్నారు. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ బీ-టీమ్‌లాగా పని చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ దీపికా, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాద‌రి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.


First Published:  19 April 2023 5:56 PM IST
Next Story