Telugu Global
Telangana

హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారు.. సెకండ్ లిస్ట్ పై ఫస్ట్ రియాక్షన్

హైదరాబాద్‌ లో పీజేఆర్‌ లాంటి నాయకుడి కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు విష్ణువర్దన్ రెడ్డి. తాను కచ్చితంగా జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారు.. సెకండ్ లిస్ట్ పై ఫస్ట్ రియాక్షన్
X

అక్కకు టికెట్, తమ్ముడికి బిస్కెట్.. సెకండ్ లిస్ట్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ వ్యవహారంపై పేలిన జోకు ఇది. పీజేఆర్ కూతురు విజయా రెడ్డికి టికెట్ ఇచ్చి, కొడుకు విష్ణువర్దన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం. సెకండ్ లిస్ట్ లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజారుద్దీన్ ని ఖరారు చేయడంతో ఆ స్థానంపై ఆశ పెట్టుకున్న విష్ణువర్దన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. హాఫ్‌ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఆయన కాంగ్రెస్‌ పార్టీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఇంత మోసం చేస్తారా..?

తనకు టికెట్ ఇస్తానని మాణిక్ రావ్ థాక్రే కూడా హామీ ఇచ్చారని, ఇప్పుడు లిస్ట్ లో తన పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణువర్దన్ రెడ్డి. ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో టికెట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్న ఏకైక స్థానం జూబ్లీహిల్స్‌ అని.. అలాంటి సీటును నియోజకవర్గంతో సంబంధంలేని అజారుద్దీన్ కి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. చాలా రోజులుగా తాను ఇంటింటి ప్రచారం చేస్తున్నానని అన్నారు.

అయితే పీజేఆర్ కుటుంబంలో ఆయన కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇవ్వడం.. కొడుకు విష్ణువర్దన్ రెడ్డికి మైనస్ గా మారిందనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే నిబంధన ఉంటే.. ఇప్పటికే చాలామందికి రెండు టికెట్లు ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తున్నారు విష్ణు. హైదరాబాద్‌ లో పీజేఆర్‌ లాంటి నాయకుడి కుటుంబానికి రెండు టికెట్లు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను కచ్చితంగా జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.


First Published:  28 Oct 2023 6:00 AM GMT
Next Story