Telugu Global
Telangana

పాలమూరులో కారుకి మరింత బలం.. బీఆర్ఎస్ లోకి రావుల..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదు అని తేలిపోయింది. ఈ దశలో ఇంకా టీడీపీలోనే ఉండటం నేతలకు ఏమాత్రం లాభసాటి వ్యవహారం కాదు.

పాలమూరులో కారుకి మరింత బలం.. బీఆర్ఎస్ లోకి రావుల..?
X

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారుకి మరింత బలం చేకూరే సూచనలు కనపడుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఈపాటికే ఓ దఫా చర్చలు పూర్తయ్యాయి. సహచరులు, తన అనుచరులతో కూడా రావుల మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయిన దశలో ఇంకా సైకిల్ ప్రయాణం అవసరమా అని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు.

ఏ హామీతో..?

స్థానికంగా పట్టున్నా కూడా టీడీపీలో ఉంటే తెలంగాణలో విలువ లేదు అనే విషయం నేతలకు బాగా అర్థమవుతోంది. అందుకే ఎల్.రమణ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరిక్కడ ఆయనకు బీఆర్ఎస్ ఎలాంటి పదవి ఇస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉంటారని మంత్రులనుంచి హామీ లభించిందట. కానీ రావుల మాత్రం ప్రత్యక్ష ఎన్నికలవైపు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్లు ఖాళీ లేవు కాబట్టి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలనేది ఆయన ఆశ. మరి కేసీఆర్ ఆ హామీ ఇస్తారా..? లేక ఎమ్మెల్సీ హామీతోనే సరిపెట్టుకోమని అడుగుతారా..? వేచి చూడాలి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదు అని తేలిపోయింది. ఈ దశలో ఇంకా టీడీపీలోనే ఉండటం నేతలకు ఏమాత్రం లాభసాటి వ్యవహారం కాదు. అందుకే ఎన్నికల్లోగా సైకిల్ దిగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రావుల చేరికతో రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు సునాయాసం అవుతుందనే అంచనాలున్నాయి. అందుకే గులాబి పార్టీ కూడా ఆయన చేరికను స్వాగతిస్తోంది.

First Published:  12 Oct 2023 5:12 AM GMT
Next Story