టీవీ9 చెప్పేది నిజమా? రవిప్రకాశ్ చెప్పింది నిజమా?
నాలుగో భాగస్వామిని తాను అని రవి ప్రకాశ్ వివరించారు. మేం నలుగురం భాగస్వాములుగా టీవీ9, ఏబీసీఎల్ సంస్థలు నడుస్తున్నాయని, ప్రస్తుతం టీవీ9లో అకౌంట్స్ చూడ్డానికి వచ్చానని వివరించారు.
టీవీ9 కార్యాలయంలో ఒక్కసారిగా రవి ప్రకాశ్ కలకలం రేపారు. అకస్మాత్తుగా దిగి లోపలికి వెళ్లారు. ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో తెలియక అంతా గందరగోళానికి గురయ్యారు. టివీ9కి ఎందుకొచ్చారో రవి ప్రకాశ్ వివరించారు. అయితే టీవీ9 రవి ప్రకాశ్ చెప్పింది అబద్ధం అని నర్మగర్భంగా చెప్పేలా ఒక ప్రకటన విడుదల చేసింది.
టీవీ9 నుంచి బయటకొచ్చిన అనంతరం రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. టీవీ9లో నలుగురు భాగస్వాములు ఉన్నారని, వారిలో ఒకరు జూపల్లి రామేశ్వరరావు (మై హోమ్), రెండో భాగస్వామి మేఘా కృష్ణారెడ్డి, మూడో పార్టనర్ ఎంవీకేఎన్ మూర్తి, నాలుగో భాగస్వామిని తాను అని రవి ప్రకాశ్ వివరించారు. మేం నలుగురం భాగస్వాములుగా టీవీ9, ఏబీసీఎల్ సంస్థలు నడుస్తున్నాయని, ప్రస్తుతం టీవీ9లో అకౌంట్స్ చూడ్డానికి వచ్చానని వివరించారు.
అయితే దీనిపై టీవీ9 యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏబీసీపీఎల్ అనగా టీవీ9 గ్రూపు తన అనుబంధ సంస్థల విలీనానికి వాటాదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఫిబ్రవరి 6వ తేదీన వాటాదారులకు సమాచారం పంపామని తెలిపారు. ఈ సమావేశం మార్చి 2న జరగనుందని, 97 శాతం వాటా అలంద మీడియా కలిగి ఉందని, అతి చిన్న వాటాదారుడు అయిన రవిప్రకాశ్ కి విలీనానికి సంబంధించిన పత్రాల పరిశీలనకి అనుమతి ఇచ్చామని, ఖాతాల పరిశీలనకి కాదని ప్రకటించారు. అకౌంట్ల తనిఖీకి అవకాశంలేదని స్పష్టం చేశారు. అంటే రవి ప్రకాశ్‌ని ఓ వాటాదారుడిగా పిలవడం కరెక్టే అని టీవీ9 ఒప్పుకుంది. కానీ ఆయన చెప్పినట్టు ఖాతాల పరిశీలనకి కాదు, విలీన పత్రాల పరిశీలనకి అని వివరణ ఇస్తోంది.
టీవీ9ని శీని రాజు అమ్మేశాక, సంస్థకి చెందిన రూ.18 కోట్ల నిధులను రవిప్రకాశ్ అక్రమంగా డ్రా చేశారంటూ అప్పట్లో కొత్త టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో పోలీసులు రవిప్రకాశ్‌ని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో బయటకొచ్చారు. చాలా రోజులుగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్న రవిప్రకాశ్ టీవీ9 ఆఫీసులో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.