Telugu Global
Telangana

రేషన్ డీలర్ల కమీషన్ రెట్టింపు.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడం ద్వారా ప్రతి ఏటా వారికి రూ. 303 కోట్లు అందించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.

రేషన్ డీలర్ల కమీషన్ రెట్టింపు.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
X

తెలంగాణలో రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతామంటూ గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ కమీషన్ ని ఏకంగా రెట్టింపు చేస్తూ ఇప్పుడు జీవో ఇచ్చింది. ఈ జీవోతో తెలంగాణ రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఈ జీవో కాపీలను రేషన్ డీలర్లకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తక్షణమే ఈ పెంపు అమలులోకి వస్తుందని హామీ ఇచ్చారు.

ఇప్పటి వరకు తెలంగాణలో రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ టన్ను బియ్యానికి రూ.700. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం టన్నుకి కేవలం రూ.450 మాత్రమే ఇస్తోంది. ఇప్పటి వరకు దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు కమీషన్ ఇస్తోంది. ప్రస్తుతం రూ.700 గా ఉన్న కమీషన్ ని రూ.1400కి చేర్చింది కేసీఆర్ సర్కార్. అంటే కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.950 రూపాయలు ఇస్తోందనమాట.

అదనపు భారం..

రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడం ద్వారా ప్రతి ఏటా వారికి రూ. 303 కోట్లు అందించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్‌ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం కేసీఆర్ డీలర్ల కమీషన్‌ ను రెండింతలు చేశారని చెప్పారు. కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ ను అదనంగా అందజేస్తుందని అన్నారు మంత్రి గంగుల. జీవో విడుదల సందర్భంగా రేషన్‌ డీలర్ల సంఘం ప్రతినిధులు మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  1 Oct 2023 3:08 AM GMT
Next Story