ఫలించిన హరీష్ మంత్రాంగం.. బీఆర్ఎస్ గూటికి రామ్మోహన్ గౌడ్
ఎల్బీనగర్ టికెట్ కోసమే రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ లో చేరగా.. హస్తం పార్టీ అనూహ్యంగా ప్యారాచూట్ నేత మధుయాష్కీకి టికెట్ కేటాయించింది. దీంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ఇది. ఆ నియోజకవర్గం టికెట్ కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గౌడ్. అయితే కాంగ్రెస్ హ్యాండివ్వడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఇదంతా కేవలం 20 రోజుల వ్యవధిలోనే జరగడం విశేషం. రామ్మోహన్ గౌడ్ ని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు మంత్రి హరీష్ రావు. చర్చలు ఫలప్రదం అయ్యాయి. తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఆయనకు పార్టీ కండువా కప్పారు హరీష్ రావు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు. మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో తన నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి పార్టీలో చేరిన రామ్మోహన్ గౌడ్ గారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు గారు. pic.twitter.com/P22jOnQPoy
— Office of Harish Rao (@HarishRaoOffice) November 1, 2023
అసలేం జరిగింది..?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్, టీడీపీ నేత ఆర్.కృష్ణయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (కాంగ్రెస్) అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో రామ్మోహన్ గౌడ్ కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ సారి సుధీర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఖాయం కావడంతో రామ్మోహన్ గౌడ్ అక్టోబర్ 12న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఎల్బీనగర్ టికెట్ కోసమే రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ లో చేరగా.. హస్తం పార్టీ అనూహ్యంగా ప్యారాచూట్ నేత మధుయాష్కీకి టికెట్ కేటాయించింది. దీంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.
హైడ్రామా..
రామ్మోహన్ గౌడ్ అసంతృప్తితో ఉండగా.. ఆయన ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు హడావిడి చేశారు. కానీ హరీష్ రావు.. రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. హరీష్ ఆహ్వానం మేరకు రామ్మోహన్ గౌడ్ తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయన మెడలో గులాబి కండువా చూసి.. కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనకు పార్టీ సముచిత స్థానం ఇస్తుందని హామీ ఇచ్చారు హరీష్ రావు.
♦