Telugu Global
Telangana

'తెలంగాణ ఆన్ ట్రాక్' విడుదల.. రామ్ మిరియాల పాడిన టీఎస్ఆర్టీసి బస్సు కథ

'తెలంగాణ ఆన్ ట్రాక్' పేరుతో రూపుదిద్దుకున్న ఈ పాటను బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ విడుదల చేశారు.

తెలంగాణ ఆన్ ట్రాక్ విడుదల.. రామ్ మిరియాల పాడిన టీఎస్ఆర్టీసి బస్సు కథ
X

తెలంగాణ స్టేట్ ఆర్టీసీ (టీఎస్ఆర్టీసీ) సంస్థ గొప్పతనాన్ని, ఉద్యోగుల కష్టాన్ని, అందిస్తున్న సేవలను, ప్రయాణికులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిరియాల ఒక పాట రూపొందించారు. 'తెలంగాణ ఆన్ ట్రాక్' పేరుతో రూపుదిద్దుకున్న ఈ పాటను బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎండీ వీసీ. సజ్జనార్ విడుదల చేశారు. హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేయగా.. అప్పుడే ట్రెండింగ్‌గా మారిపోయింది.

ఆర్టీసీకి 90 ఏళ్ల చరిత్ర ఉందని.. సామాన్యులే కాకుండా ప్రజా ప్రతినిధులు, మేధావులు, అధికారులు, బ్యూరోక్రాట్స్ ఎంతో మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని బాజిరెడ్డి పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ అంటే సామాన్యుడి నేస్తమని.. ఈ సంస్థ పని తీరును ప్రజల్లోకి తీసుకొని వెళ్లి మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాటను రెండు నెలల పాటు కష్టపడి రూపొందించినట్లు ఆయన తెలిపారు. రామ్ మిరియాల పాడిన ఈ పాట ద్వారా ప్రజల్లోకి ఆర్టీసీ మరింత బలంగా వెళ్తుందనే నమ్మకం ఉందన్నారు.

ప్రైవేట్ రవాణా పెరిగినా.. తెలంగాణలో ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారని వీసీ. సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సు గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పడమే 'తెలంగాణ ఆన్ ట్రాక్' సాంగ్ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఆర్టీసీతో ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని రామ్ చాలా గొప్పగా వివరించాడని అభినందించారు.

ఆర్టీసీ మీద పాట రాయడానికి పెద్దగా కష్టం అనిపించలేదని రామ్ మిరియాల చెప్పుకొచ్చారు. ఆర్టీసీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, చిన్నప్పటి నుంచి ఈ బస్సులు ఎక్కి ప్రయాణించిన వాడినే కాబట్టి చాలా ఈజీగానే పాట రాశానని అన్నారు. మధ్య తరగతి కుటుంబానికి ఆర్టీసీ ఒక నేస్తమని రామ్ అన్నారు.

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు




First Published:  21 Dec 2022 4:42 PM IST
Next Story