ఏపీ, తెలంగాణల్లో ఏకగ్రీవంగా రాజ్యసభ ఎన్నికలు..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష టీడీపీకి 23 మంది. అయితే ఇందులో విశాఖ ఉక్కు ప్రైవైటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో టీడీపీ బలం 22కి పడిపోయింది.
రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకోసారి కొంతమంది పదవీకాలం ముగిసిపోతుంటుంది. ఈ ఏడాది ఇలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొత్తం ఆరుగురు ఎగువ సభ నుంచి రిటైరవుతున్నారు. వారి స్థానంలో తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ముగ్గురు కొత్త సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరిరోజు. అయితే ఈసారి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
ఏపీ నుంచి ముగ్గురూ వైసీపీ నేతలే
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష టీడీపీకి 23 మంది. అయితే ఇందులో విశాఖ ఉక్కు ప్రైవైటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో టీడీపీ బలం 22కి పడిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అందులో సగం బలం మాత్రమే ఉండటంతో చంద్రబాబు హ్యాండ్సప్ అనేశారు. దీంతో వైసీపీ నుంచి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పారిశ్రామికవేత్త మేడా రఘునాథరెడ్డిలు నామినేషన్లు వేశారు. టీడీపీ పోటీచేయకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
తెలంగాణలో రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్
మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార కాంగ్రెస్‌కు 2, బీఆర్ఎస్‌కు 1 రాజ్యసభ స్థానం దక్కనున్నాయి. కాంగ్రెస్ తన రెండు స్థానాలకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌ల పేర్లు ఖరారు చేసింది. బీఆర్ఎస్ తనకు దక్కే ఏకైక స్థానానికి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేరు ఓకే చేసింది. వీరు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేసే అవకాశం ఉండటంతో ఇక్కడా ఏకగ్రీవానికే అవకాశాలున్నాయి.