పొలిటికల్ ట్విస్ట్: రాజయ్యతో రాజనర్సింహ
వీరిద్దరూ ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ లో భేటీ కావడం విశేషం. అక్కడే అరగంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. రాజయ్యను రాజనర్సింహ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, టికెట్ పై కూడా హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ జాబితా విడుదల తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసంతృప్తులంతా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహను కలవడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ లో టికెట్ దక్కని రాజయ్య, కాంగ్రెస్ కి దగ్గరవుతున్నారంటూ కొత్త వార్తలు మొదలయ్యాయి. ఇంతకీ రాజయ్య, రాజనర్సింహ భేటీ దేనికోసం..? రాజయ్య బీఆర్ఎస్ కి దూరమవుతున్నారా..? కాంగ్రెస్ లో ఆయనకు టికెట్ కన్ఫామ్ అయిందా, లేదా..?
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు స్థానం లభించని విషయం తెలిసిందే. ఆయన బదులు కడియం శ్రీహరికి అక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. అయితే అప్పటికప్పుడు రాజయ్య బాధపడినా, తాను సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని చెప్పారు. ఇప్పటి వరకూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే జనంలోకి వస్తున్నారు. కడియం శ్రీహరిపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఇటీవల రాజయ్య తన అనుచరులతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. జమిలి ఎన్నికల కారణంగా తెలంగాణ ఎన్నికలు ఆలస్యమయితే కచ్చితంగా తనకే టికెట్ వస్తుందని, ఆ ఆశ తనకుందని అంటున్నారు రాజయ్య. బీఆర్ఎస్ లిస్ట్ లో మార్పులుంటాయని, తనకి అవకాశం వస్తుందని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ క్రమంలో వల్మిడి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాజయ్య, కడియం శ్రీహరి చేతులు కలిపినా వెంటనే ఎవరి దారి వారు చూసుకున్నారు. ఉదయం పార్టీ నాయకులతో కలసి ఉన్న రాజయ్య, సాయంత్రానికల్లా కాంగ్రెస్ సీనియర్ నేతను కలవడం మాత్రం విశేషం.
హన్మకొండలోని ఓ హోటల్ లో జరిగిన ఎస్సీ మేథావుల సదస్సుకి రాజయ్య, రాజనర్సింహ హాజరయ్యారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల నాయకులు కాబట్టి బయట కలుసుకున్నా అది కార్యక్రమం వరకే ఉంటుంది. కానీ వీరిద్దరూ ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ లో భేటీ కావడం విశేషం. అక్కడే అరగంటకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. రాజయ్యను రాజనర్సింహ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, టికెట్ పై కూడా హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తనకు టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్న రాజయ్య, కాంగ్రెస్ గేలానికి చిక్కుకుంటారా, లేక బీఆర్ఎస్ తోనే ఉంటారా అనేది వేచి చూడాలి.