Telugu Global
Telangana

కడియంతో రాజయ్య కాంప్రమైజ్.. ఒక్కతాటిపైకి స్టేషన్ ఘన్‌పూర్‌ లీడర్లు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దగ్గరకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి వచ్చారు. ప్రగతిభవన్‌కు వారిద్దరినీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటబెట్టుకొని వచ్చారు.

కడియంతో రాజయ్య కాంప్రమైజ్.. ఒక్కతాటిపైకి స్టేషన్ ఘన్‌పూర్‌ లీడర్లు
X

బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పి పోయింది. స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంపై అసంతృప్తితో రగిలిపోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ఎట్టకేలకు కాంప్రమైజ్ అయ్యారు. మొదటి నుంచి నిప్పు ఉప్పులా ఉండే శ్రీహరి, రాజయ్యల మధ్య సయోధ్య కుదిరింది. చిరకాల ప్రత్యర్థులైన వీరిద్దరూ ఎన్నికల్లో సహకరించుకోవడానికి కలిసిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం కోసం పని చేస్తానని రాజయ్య చెప్పారు. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య వైరం పెరిగిపోతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆందోళన చెందింది. కానీ, చివరకు వాళ్లిద్దరూ కాంప్రమైజ్ కావడంతో పార్టీ అగ్రనాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దగ్గరకు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి వచ్చారు. ప్రగతిభవన్‌కు వారిద్దరినీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటబెట్టుకొని వచ్చారు. కేటీఆర్‌తో కాసేపు చర్చించిన అనంతరం శ్రీహరికి సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాజయ్య చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు.

గతంలో ఉన్న విభేదాలు మరిచిపోయి తనకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించిన రాజయ్యకు శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి ఇద్దరూ ఫొటోలు దిగారు. కడియం, రాజయ్య కలిసిపోవడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్‌కు తిరుగే లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఎన్నికల తర్వాత తాటికొండ రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇకపై విభేదాలు వీడి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం.


First Published:  22 Sept 2023 8:25 AM GMT
Next Story