అయిననూ వేచి చూడవలె.. రాజయ్య ఆశావాదం
115 మంది అభ్యర్థుల లిస్ట్ తుది జాబితా కాదని, ఎన్నికల నాటికి ఏమైనా జరగవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు రాజయ్య వెల్లడించారు.
బీఆర్ఎస్ టికెట్ దక్కనివారిలో చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ అనుచరులతో రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారు. కానీ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాత్రం తనకు టికెట్ గ్యారెంటీ అనే ఆశావాదంతో ఉన్నారు. లిస్ట్ మారిపోయి మరీ తనకు టికెట్ ప్రకటిస్తారని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. అభ్యర్థుల జాబితాలో మార్పులు వస్తాయని అంటున్నారు. ఇల్లు అలకగానే పండగ కాదంటూ పరోక్షంగా కడియం శ్రీహరికి చురకలంటిస్తున్నారు.
నేనే ఎమ్మెల్యే.. గుర్తుంచుకోండి..
కడియం శ్రీహరిని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో రాజయ్య వైపు ఉన్నవారు కొంతమంది అటువైపు వెళ్లిపోయారు. ఆయనతోపాటు ప్రచారానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తన నుంచి దూరమైన వారందరికీ రాజయ్య వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎమ్మెల్యే ద్వారానే రావాలని, జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. నియోజకవర్గానికి తానే బాస్ అని అన్నారు.
పదవులు కార్యకర్తలు ఇచ్చే భిక్ష అని.. కార్యకర్తలంటే నాయకులు భయపడాలన్నారు ఎమ్మెల్యే రాజయ్య. పార్టీ కోసం ప్రాణత్యాగం చేశామని, ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ కు అండగా ఉన్నామని అన్నారు. 115 మంది అభ్యర్థుల లిస్ట్ తుది జాబితా కాదని, ఎన్నికల నాటికి ఏమైనా జరగవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ తనకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు రాజయ్య వెల్లడించారు.