Telugu Global
Telangana

ప్రచారం తర్వాత.. ముందు పోస్టర్లు వేయండి..

పోస్టర్లను పోస్టర్లతోటే ఎదుర్కోవాలి అన్నట్టుగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని వాల్ పోస్టర్ల వైపు మళ్లించారు. సెల్ఫ్ డబ్బా మొదలుపెట్టారు.

ప్రచారం తర్వాత.. ముందు పోస్టర్లు వేయండి..
X

సోషల్ మీడియా కారణంగా ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నా.. మునుగోడులో మాత్రం ఇటీవల వాల్ పోస్టర్లు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఇమేజ్‌ని బాగా డ్యామేజీ చేశాయి. ఈ పోస్టర్ల కారణంగానే చండూరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా తగలబడింది. తాజాగా ఇప్పుడీ నెగెటివ్ ప్రచారాన్ని కవర్ చేసేలా.. తనకు పాజిటివ్‌గా పోస్టర్లు వేయించుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి. "రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు, నీవల్లే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి " అంటూ నారాయణపురం మండలంలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

గతంలో ఇలా..

"మునుగోడు నిన్ను క్షమించదు రాజగోపాల్ రెడ్డీ.. ! తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను, ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షా తో బేరమాడిన నీఛుడివి" అంటూ అప్పట్లో మునుగోడులో వెలుగులోకి వచ్చిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులకు అమ్ముడుపోయారంటూ పోస్టర్లు పడ్డాయి. దీంతో మరింత డ్యామేజీ జరిగింది. ఆ తర్వాత దుబ్బాక ప్రజల పేరుతో మళ్లీ పోస్టర్లు పడ్డాయి. "మునుగోడు ప్రజలారా.. ! మేం మోసపోయాం, మీరు మోసపోకండి.." అంటూ పోస్టర్లు వేశారు. వీటన్నిటితో రాజగోపాల్ రెడ్డి బాగా ఇబ్బంది పడ్డారు.

సెల్ఫ్ డబ్బా..

పోస్టర్లను పోస్టర్లతోటే ఎదుర్కోవాలి అన్నట్టుగా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని వాల్ పోస్టర్ల వైపు మళ్లించారు. సెల్ఫ్ డబ్బా మొదలుపెట్టారు. నీ ధిక్కారంతోనే మునుగోడుకి మంచి రోజులు వచ్చాయంటూ ప్రజలు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పోస్టర్లు వేయించుకున్నారు రాజగోపాల్ రెడ్డి. పోస్టర్లతో వచ్చిన వ్యతిరేక ప్రచారాన్ని ఇలా పోస్టర్లతోటే తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరని అంటున్నారు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు. కాంట్రాక్ట్ సొమ్ములకు ఆయన అమ్ముడుపోయిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. మరి పోస్టర్లతో కవర్ చేసుకోవాలనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా..! వేచి చూడాలి.

First Published:  17 Oct 2022 11:45 AM IST
Next Story