లోక్‌సభకు రాజాసింగ్. .మహారాష్ట్ర నుంచి పోటీ..?
ఇటీవల తరచుగా మహారాష్ట్రలో.. ప్రధానంగా ఔరంగాబాద్‌లో పర్యటిస్తున్నారు రాజాసింగ్. స్థానికంగా నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటూ ప్రసంగాలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారని తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
తన ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాజాసింగ్.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోనూ ఇలాంటి ప్రసంగాలే చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ ఆయనపై మహారాష్ట్రలో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఔరంగాబాద్ ఎంపీగా MIM లీడర్ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. ఔరంగాబాద్ నుంచి పోటీ చేయాలన్న కోరికను ఇప్పటికే రాజాసింగ్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ హైకమాండ్ మాత్రం ఆయనను హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తోందట. కాగా, హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజాసింగ్ సుముఖంగా లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. హైదరాబాద్ కాకుంటే జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్‌కు హైకమాండ్ ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల తరచుగా మహారాష్ట్రలో.. ప్రధానంగా ఔరంగాబాద్‌లో పర్యటిస్తున్నారు రాజాసింగ్. స్థానికంగా నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటూ ప్రసంగాలు చేస్తున్నారు. లోకల్ క్యాడర్‌తో పరిచయాలు సైతం పెంచుకున్నారు. ఔరంగాబాద్‌లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే 4,492 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఔరంగాబాద్ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్ భావిస్తున్నారని తెలుస్తోంది.