కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాచేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
కొంత కాలంగా సాగుతున్న అయోమయానికి తెరదించితూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరగడం కోసమే తాను రాజీనామా చేశానని ప్రకటించారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోతున్నారో మాత్రం చెప్పలేదు.
''మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్ బుక్‌లు ఇప్పించాలి'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన.
''నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోంది. కాఁగ్రెస్ అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ బలహీనపడింది. నా రాజీనామా ద్వారా ప్రజలకు కొంత మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా. నా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ భవిష్యత్ కోసమే. మునుగోడులో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తారు'' అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
20 ఏళ్ళ పాటు కాంగ్రెస్ ను, నాయకత్వాన్ని తిట్టిపోసిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించింది. అలాంటి వాళ్ళ కింద పని చేసే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ మీద గౌరవంతో తాను కాంగ్రెస్ ను విమర్శించడంలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.