ఆగస్ట్ 1, 2 తేదీల్లో వర్షాలు.. ఎక్కడెక్కడంటే..?
వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊరట చెందారు. వరదలతో నష్టపోయినవారు కూడా తిరిగి రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు. ఈ దశలో మళ్లీ వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే ఇది అన్ని జిల్లాలకు కాదు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కనపడుతుందని చెప్పింది.
ఆగస్ట్ 1, 2 తేదీల్లో వర్షాలు..
ఆగస్టు 1వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముంది. ఆగస్టు 2న కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
కొత్తగూడెంలో వర్షం..
రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షం కురిసింది. రుతు పవనాలు ఆగస్టులో బలహీనపడే అవకాశాలున్నాయి. ఆగస్ట్ లోనే ఎల్ నినో దశ కూడా మొదలవుతుందని, దాని ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని అంచనా.