అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు
వచ్చే మూడు రోజులు నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వచ్చే మూడు రోజులు నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షం గ్యాప్ లేకుండా పడుతుండటంతో నగరంలో హై అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు.
భారీ వర్షాలతో చాదర్ ఘాట్, మలక్ పేటలో వరద నీరు నిలిచింది. చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట, దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ కారిడర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లపైకి వరద చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.