భారీ వర్షాలు.. పోలింగ్ శాతం పడిపోతుందా..?
నిజామాబాద్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం కుప్పకూలింది. సిబ్బంది అంతా భవనాల్లోకి పరుగులు తీశారు.
రాజకీయ ప్రచారం ముగిసిన కాసేపటికే నిజామాబాద్ లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆ బీభత్సానికి నిజామాబాద్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం కుప్పకూలింది. సిబ్బంది అంతా భవనాల్లోకి పరుగులు తీశారు. వడగళ్ల వాన వెలిసిన తర్వాత ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుందో అని అందరూ భయపడుతున్నారు.
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిజామాబాద్ నగరంతో పాటు నవీపేట, ఎడపల్లి, బోధన్, రెంజల్, సాలూర, నందిపేట్ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. చాలా మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి.
ఎన్నికలపై ఎంత ప్రభావం..?
వర్షాలు కొంతవరకు ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపించాయి. తీరా పోలింగ్ రోజు కూడా వర్షం పడితే ఓటర్లు ఇబ్బంది పడటం ఖాయం. పోలింగ్ శాతంపై కచ్చితంగా ఆ ప్రభావం కనపడుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉంటుంది అనుకున్న ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.