Telugu Global
Telangana

హైదరాబాద్ చుట్టూ రైల్వే లైన్.. దేశంలో ఇదే మొదటి సారి

538 కిలోమీటర్ల పొడవైన ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్ చుట్టూ రైల్వే లైన్.. దేశంలో ఇదే మొదటి సారి
X

హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) తరహాలోనే.. ఔటర్ రైల్వే లైన్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 563.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేను చేపట్టాలని ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన స్థల నిర్ధారణ చేపట్టి, డీపీఆర్ రూపొందించడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్ల కేటాయించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే.. నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు నగరం గుండా వెళ్లే రైల్వే లైన్లపై ఒత్తిడి తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దేశంలో ఈ తరహాలో ఔటర్ రింగ్ రైల్వే లైన్ నిర్మించడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తున్నారు. దీనికి సమాంతరంగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలోని విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, కర్నూలు, వికారాబాద్, కర్నూలు, ముంబై, కరీంనగర్‌ల నుంచి వచ్చే రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ రైల్వే మార్గాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. కొత్తగా నిర్మించనున్న ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్ వల్ల అనేక పట్టణాలు, గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి మరింత సులభంగా చేరుకునే అవకాశం ఉన్నది. 538 కిలోమీటర్ల పొడవైన ఈ ఔటర్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.

ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లపై ఒత్తిడి పెరుగుతోంది. అంతే కాకుండా రైల్వే లైన్లు కూడా పూర్తిగా బిజీగా మారిపోయాయి. ఔటర్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం వల్ల గూడ్స్ రైళ్లను నగరంలోకి రానివ్వకుండా 50 కిలోమీటర్ల ముందుగానే మళ్లించే అవకాశం ఉన్నది. మిర్యాలగూడ వైపు నుంచి బెంగళూరు, ముంబై వెళ్లే గూడ్స్ బండ్లు ఎక్కువగా నగరం నుంచి వెళ్తున్నాయి. దీని వల్ల ప్రయాణికుల రైళ్లకు సిగ్నల్ దొరకడం కష్టంగా మారింది. బొగ్గు, ఆయిల్, ఇతర సరుకు రవాణా గూడ్స్ బండ్లను కూడా నగరంలోని రానివ్వకుండా మళ్లించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రైల్వే లైన్.. విజయవాడ హైవేలోని చిట్యాల వద్ద, వరంగల్ రోడ్డులోని రాయగిరి వద్ద, బెంగళూరు రోడ్డులోని బూర్గుల వద్ద, ముంబై లైన్‌లో వికారాబాద్ వద్ద, బాసర, నాందేడ్ మార్గంలో అక్కన్నపేట వద్ద మిగిలిన రైల్వే లైన్లను కలుస్తుంది. ఇవన్నీ హైదరాబాద్‌కు 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణం వల్ల హైదరాబాద్ లాజిస్టిక్ హబ్‌గా మారే అవకాశం ఉన్నది. ఔటర్ రింగ్ రైల్వే లైన్ 200 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకునేలా నిర్మించనున్నారు. దీని వల్ల రైళ్ల వేగం కూడా పెరగనున్నది.

రైల్వే శాఖ సర్వే చేపట్టి.. డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే ప్రాజెక్టు ముందుకు కదలనున్నది. అయితే.. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు కోసం తెలంగాణలో భారీ ఎత్తున భూములు సేకరించారు. ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రైల్వే లైన్ కోసం భారీగా భూములు సేకరించాలి. రైతులు, ప్రజలు మరోసారి భూములు కోల్పోతే భారీగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. రోడ్ల కంటే రైల్వే లైన్లకు మరింత ఎక్కువ భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నది.

First Published:  29 Jun 2023 6:52 AM IST
Next Story