Telugu Global
Telangana

బీజేపీ ఓడిపోయింది.. పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే..

కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని.. తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా నెరవేరుస్తామని మాటిచ్చారు రాహుల్ గాంధీ.

బీజేపీ ఓడిపోయింది.. పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే..
X

తెలంగాణలో బీజేపీ ఆల్రడీ ఓడిపోయిందని, అడ్రస్ కోల్పోయిందని.. పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యేనని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. తమకు నష్టం కలిగించే నిర్ణయాలను ఏ పార్టీ తీసుకోదని.. కానీ కాంగ్రెస్ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో నష్టం అని తెలిసినా కూడా తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు.


హామీలన్నీ నెరవేర్చాం..

కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని.. తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా నెరవేరుస్తామని మాటిచ్చారు రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, చత్తీస్ ఘడ్ లో అత్యధిక గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, కర్నాటకలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇచ్చినమాటను కాంగ్రెస్ కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు రాహుల్. తనను కేసులతో వేధించిన బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నేతలపై మాత్రం ఉదారత చూపిస్తోందన్నారు.


తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ప్రత్యే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు ప్రియాంక గాంధీ. రాజకీయ లబ్ధికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరికు సోనియా నెరవేర్చారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలను కూడా విభజన చట్టంలో పొందుపరిచామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఒక రోడ్‌ మ్యాప్‌ రూపొందించిందని.. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ ఇక్కడ అధికారంలోకి రావాలని చెప్పారు ప్రియాంక గాంధీ.


అంతకు ముందు రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణలో మూడు రోజులపాటు రాహుల్, ప్రియాంక బస్సు యాత్ర నిర్వహిస్తారు, బహిరంగ సభల్లో పాల్గొంటారు.

First Published:  18 Oct 2023 9:30 PM IST
Next Story