కులగణన కార్యక్రమానికి రాహుల్‌కు ఆహ్వానం!
నవంబర్ 6 నుంచి రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభం
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీ నుంచి కులగణన చేపట్టనున్నారు. అందుకోసం రాహుల్‌గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అధ్యక్షతన కులగణనకు సంబంధించి ప్రత్యేక సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా హాజరయ్యారు.
రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై ప్రత్యేక సమావేశంలో 103 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కులగణనకు సంబంధించి సమగ్రంగా చర్చించి పార్టీ పరంగా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని, క్షేత్ర స్థాయిలో కులగణనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, పార్టీకి ప్రయోజనం కలిగేలా దీన్ని మలుచుకోవాలని పార్టీ భావిస్తున్నది. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఈ కులగణన చేపడుతున్నందున ఆయనను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాహుల్‌కు, ఏఐసీసీ అధ్య క్షుడు మల్లిఖార్జున ఖర్గేకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
దేశమంతా తెలంగాణను అనుసరిస్తుంది: భట్టి
త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామన్నారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. భవిష్యత్తులో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని భట్టి విక్కమార్క తెలిపారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉన్నది. దీనిపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు.