కౌంటింగ్ వేళ.. రాహుల్ గాంధీ కీలక సూచనలు
పీసీసీ అధ్యక్షుడు సహా.. మరికొందరు కీలక నేతలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని గతంలో ఆదేశాలిచ్చినా.. ఇప్పుడు అభ్యర్థులెవరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని చెప్పారు రాహుల్. కౌంటింగ్ కేంద్రాల వద్దే అభ్యర్థులు ఉండాలని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ వేళ రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు కీలక సూచనలు చేశారు. రిజల్ట్ రోజున అభ్యర్థులంతా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలని, కౌంటింగ్ కేంద్రాలు దాటి బయటకు రావొద్దని సూచించారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని చెప్పారు రాహుల్.
హైదరాబాద్ కి ఎవరు..?
పీసీసీ అధ్యక్షుడు సహా.. మరికొందరు కీలక నేతలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని గతంలో ఆదేశాలిచ్చినా.. ఇప్పుడు అభ్యర్థులెవరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని చెప్పారు రాహుల్. కౌంటింగ్ కేంద్రాల వద్దే అభ్యర్థులు ఉండాలని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
డీకే పర్యవేక్షణ..
తెలంగాణకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఉన్నా కూడా.. ప్రస్తుతం వ్యవహారమంతా డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రికి కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే హైదరాబాద్ చేరుకుంటారు. ఆదివారం తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఆయన కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారు. ఆదివారం ఉదయానికి మరికొందరు ఏఐసీసీ నేతలు రాష్ట్రానికి వస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఉత్సాహంలో కాంగ్రెస్ నేతలున్నారు. బొటాబొటి స్థానాలు వస్తే, ఎమ్మెల్యేలు చేజారకుండా ఇప్పటినుంచే కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
*