జూలై 2న ఖమ్మానికి రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌లో చేరనున్న పొంగులేటి, జూపల్లి
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పొంగులేటి, జూపల్లి దాదాపు అరగంట సేపు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఘర్ వాపసీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. గతంలో పార్టీని వీడిన నాయకులతో పాటు, ఇతర పార్టీల్లోని కీలక వ్యక్తులను తిరిగి కాంగ్రెస్‌లో చేర్పించే విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సఫలం అవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ అనుచరులతో కలిసి వెళ్లారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పొంగులేటి, జూపల్లి దాదాపు అరగంట సేపు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. జూపల్లి, పొంగులేటి తమ అనుచరులను వారిద్దరికీ పరిచయం చేశారు. వారంతా గతంలో తమ పార్టీ వారేనంటూ రాహుల్ వ్యాఖ్యానించడంతో నవ్వులు పూశాయి. అనంతరం బయటకు వచ్చి కార్యాలయం లాన్‌లో ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.
జూలై 2న ఖమ్మంలో నిర్వహించే సభకు తప్పకుండా రావాలని రాహుల్ గాంధీని పొంగులేటి ఆహ్వానించారు. కాగా, దీనికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఖమ్మంలో జరిగే సభలోనే పొంగులేటి, జూపల్లి అధికారికంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. పొంగులేటి, జూపల్లి సహా వారి అనుచరులు 35 మంది కాంగ్రెస్‌లో చేరుతుండటంపై రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో ఘర్ వాపసీ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో' అనే నినాదంతో నాయకులంతా ముందుకు వెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారు. కాగా, చాలా రోజుల తర్వాత ఏఐసీసీ కార్యాలయం తెలంగాణ నాయకులతో కళకళలాడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కి తదితరులు ఉత్సాహంగా కనిపించారు.
తెలంగాణ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి, కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, తాడిపత్రి సాయి చరణ్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, కూర అన్న కిష్టప్ప, ముద్దప్ప దేశ్‌ముఖ్, జూపల్లి అరుణ్, సూర్యప్రతాప్ గౌడ్, కల్యాణ్ కుమార్ కొత్త, దండు నర్సింహా, కిచ్చారెడ్డి, గోపిశెట్టి శ్రీధర్, సూర్య, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయ్, తెల్లం వెంకట్రావు, పిడమర్తి రవి, ఆదినారాయణ, బాణోత్ విజయ, తూళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి, రాజశేఖర్, కోటా రాంబాబు, గోపాల్ రావు, డాక్టర్ రాజా రమేశ్, జూపల్లి రమేశ్, ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి, రఘునాథ యాదవ్, రాఘవేంద్ర రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, సుతగాని జైపాల్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ప్రజల నాడి తెలుసుకొనే కాంగ్రెస్‌లో చేరుతున్నాము : పొంగులేటి
గత ఆరు నెలలుగా నేను, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే విషయంపై మీడియాలో అనేక చర్చలు జరిగాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వార్తలు రాసుకున్నారు. అయితే మేమిద్దరం మాత్రం ఈ విషయంపై అనేక పర్యాయాలు కూలంకుషంగా మాట్లాడుకున్నాము. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు మా దగ్గరకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఒకానొక సమయంలో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరివైపు ఉన్నదో పూర్తిగా సర్వే చేయించాము. రెండు మూడు స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో కూడా సర్వేలు చేయించిన తర్వాత.. కాంగ్రెస్ వైపు 80 శాతం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఓడించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని పొంగులేటి చెప్పారు. అందుకే వేరే పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని స్పష్టం చేశారు. మేధావులతో సంప్రదించిన తర్వాత, సర్వే డేటా చూసి, కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడుతున్న విషయాన్ని గుర్తించి ఈ పార్టీని ఎంచుకున్నామని పొంగులేటి చెప్పారు.
జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలను సంప్రదించి.. వారిచ్చే హామీల తర్వాత ఈ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. కానీ ఈ విషయాన్ని బలంగా ఆనాడు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. అయితే ఖర్గే, రాహుల్ గాంధీ ఆలోచనలు మాతో పంచుకున్నారు. అందుకే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నామని పొంగులేటి చెప్పారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులతో పాటు.. రాష్ట్రంలోని ఇతర నాయకులు కూడా ఆ సభలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని పొంగులేటి స్పష్టం చేశారు.