Telugu Global
Telangana

రాహుల్‌ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నడు

డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చాడు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రాహుల్‌ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నడు
X

రాహుల్‌ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నాడని, పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. బుధవారం గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌ లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. డబ్బు సంచుల కోసమే రాహుల్‌ గాంధీ మూసీ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణలో బుల్డోజర్‌ ప్రభుత్వంతో పేదలు చచ్చిపోతుంటే రాహుల్‌ గాంధీ ఎక్కడ పోయాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నపిల్లాడు పిలిచినా సరే వస్తాను అని చెప్పిన రాహుల్‌ గాంధీ ఇప్పుడేమయ్యాడని నిలదీశారు. ఢిల్లీకి డబ్బు కట్టు ఇచ్చేందుకే పేదల ఇండ్లను రేవంత్‌ ప్రభుత్వం కూల్చేస్తుందన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్‌ కు ఇస్తారో తనకు తెలుసని.. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్‌ కాదు.. లూటిఫికేషన్‌ అన్నారు. బీజేపీ ఎందుకు దీనిపై మౌనంగా ఉందో చెప్పాలన్నారు. కేంద్రం, బీజేపీ పెద్దలతోనే హైడ్రాకు అధికారాలు కల్పించే ఆర్డినెన్స్‌ కు గవర్నర్‌ ఆమోదం తెలిపారన్నారు. హైడ్రా పై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. మూసీ ప్రాజెక్టుపై ఒకటి, రెండు రోజుల్లోనే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తానని తెలిపారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు అవుతుందో కూడా వివరాలు వెల్లడిస్తానన్నారు. పేదలకు నష్టం చేయకుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయవచ్చనే వివరాలు ప్రజలకు చెప్తానని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి ఓ అభినవ గోబల్స్ గా మారాడని, మూసీ నదికి ఇరువైపుల బంగారు తాపడం చేపిస్తే తప్ప లక్షన్నర కోట్లు ఖర్చు అవ్వదన్నారు. మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్ పార్టీకి లాభం తప్ప సాధారణ ప్రజలకి ఒరిగేదీమి లేదన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయో ప్రజలకు మంత్రి సమాధానం చెప్పాలన్నారు. హైడ్రా, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వల్ల సిటీలో 35 లక్షల మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అప్పటి సీఎం కేసీఆర్‌ మూడు గంటలు ప్రజెంటేషన్‌ ఇచ్చారని, మూసీ ప్రాజెక్టుపై మూడు నిమిషాలైనా చెప్పేవాళ్లు ఈ ప్రభుత్వంలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వం దగ్గర కనీసం మూసీ డీపీఆర్‌ అయినా ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్‌ రెడ్డి వణికి పోతున్నాడని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో భట్టితో మాట్లాడించారని అన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి రుణమాఫీ పూర్తి చేశామని చెప్తుంటే.. వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని అంటున్నారని తెలిపారు. సీఎం ఫార్మాసిటీ రద్దు అంటున్నారని, సీఎస్‌ కోర్టులో ఫార్మాసిటీ రద్దు కాలేదని అఫిడవిట్‌ ఇచ్చారని అన్నారు. వర్షాకాలం పంట సీజన్‌ పూర్తయినా రైతుబంధు వేయలేదన్నారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం, పింఛన్ల రెట్టింపు లాంటి హామీలు నిలబెట్టుకోని రేవంత్‌ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని ఎలా చెప్తున్నాడని ప్రశ్నించారు. నమామీ గంగే ప్రాజెక్టులో గంగా నది పునరుజ్జీవం, సుందరీకరణకు కి.మీ.కు రూ.17 కోట్లు ఖర్చు చేస్తే మూసీ ప్రాజెక్టులో కి.మీ.కు రూ.2,700 కోట్లు ఎందుకని ప్రశ్నించారు. సీఎంతో మంత్రులకు సఖ్యత లేదని, మూసీ ప్రాజెక్టు వ్యయంపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. లక్షలాది కుటుంబాలకు ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. మూసీ బాధితులు ఆక్రమణదారులను ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

మూసీ ప్రాజెక్టు గురించి కోమటిరెడ్డికి అవగాహన లేదు

మూసీ ప్రాజెక్టు గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేదని కేటీఆర్‌ అన్నారు. ఆయనకు దమ్ముంటే మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు వెంకట్‌ రెడ్డికి సన్మానం చేస్తానని అన్నారు. మూసీ పై ఏర్పాటు చేసిన ఎస్టీపీల గురించి కూడా ఆయనకు ఏమి తెలియదన్నారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయ్యాక మూసీలో నీళ్లన్నీ శుద్ధి అవుతాయని తెలిపారు. మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఆమెపై ఏ ఒక్కరూ మాట్లాడలేదన్నారు. సోషల్‌ మీడియాలో తమపై ట్రోలింగ్‌ పేరుతో దాడి జరగడం లేదా అని ప్రశ్నించారు. కొందరికి ఉచ్చ ఆగడం లేదు అని గతంలో అన్నది ఆమెనే కదా అని ప్రశ్నించారు. ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఆమె మాట్లాడిన వీడియోలు పంపిస్తా కావాలంటే చూసుకోవాలన్నారు. హీరోయిన్ల ఫోన్లు టాప్‌ చేశారని ఆమె మాట్లాడారని, వాళ్లు మహిళలు కాదా, వారికి మనోభావాలు ఉండవా అని ప్రశ్నించారు. తమపై అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు తమ ఇండ్లల్లోని మహిళలు బాధపడరా? ఏడవరా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలను పంపిస్తానని, వెంటనే సీఎం నోటిని ఫినాయిల్‌ తో కడగాలని డిమాండ్‌ చేశారు.

మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం

మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో మూసీ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. వారికి బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షంగా పోరాటం చేస్తూనే…పేద ప్రజల తరఫున లీగల్ఫై ట్ చేస్తామన్నారు. అన్ని పర్మిషన్లు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఇప్పుడు వాళ్ల ఇండ్లు కూల్చడం దుర్మార్గమని అన్నారు. ఈ సందర్భంగా బాధితులు కేటీఆర్ కు తమ గోడు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి కేటీఆర్ ధైర్యం చెప్పారు.

First Published:  2 Oct 2024 2:45 PM IST
Next Story