టీఆరెస్ తో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ..
టీఆరెస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ఇటీవల కాలంలో వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని ఆయన ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారంనాడు ఆయన తిమ్మాపూర్ లో మీడియాతో మాట్లాడారు.
రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్- టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని ప్రకటించారు. ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులపై పలు ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రకటనతో ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. బీఆర్‌ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవవసరం లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని వాటికి ఆ సొమ్ము ఎక్కడనుంచి వస్తోందని రాహుల్ ప్రశ్నించారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారంనాడు ఆయన తిమ్మాపూర్ లో మీడియాతో మాట్లాడారు.
బిజెపి దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఆర్ ఎస్ ఎస్ కబంధ హస్తాలనుంచి దేశానికి విముక్తి కలిగిస్తామన్నారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ వర్గాలకే కొమ్ము కాస్తోందని, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. మోడీ అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని మీడియాను కూడా నియంత్రిస్తోందని విమర్శించారు.
దేశంలో పెచ్చుమీరుతున్న విద్వేషాలకు వ్యతిరేకంగా సమగ్రత, సమైక్యత, శాంతి కోసమే భారత జోడో యాత్ర చేస్తున్నామన్నారు. ఇది క్రీడా యాత్ర కాదన్నారు. తన యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ వారి సాధక బాధలను వింటున్నామని అధకారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ తో మాట్లాడిన విషయాలతో తమకు సంబంధం లేదన్నారు. అయితే విపక్షాల మధ్య ఐక్యత అవసరం అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల గురించి మల్లికార్జు ఖర్గే చూసుకుంటున్నారని చెప్పారు.
రేపు భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న ఖర్గే
మంగళవారంనాడు రాహుల్ గాంధీ యాత్ర హైదరాబాద్ లో ప్రవేశించనున్నది. ఈ యాత్రలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. రేపు ఉదయం 8 గంటలకు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకుంటారని, సాయంత్రం 4 గంటలకు భారత్ జోడో యాత్రలో ఖర్గే పాల్గొంటారని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది.
కాగా, ఈరోజు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్దంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. గుజరాత్‌లోని మోర్బి సస్పెన్షన్ బ్రిడ్జి దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మంగళవారంనాడు భారత్ జోడో యాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది. చారిత్రక చార్మినార్‌ను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం నెక్లెస్ రోడ్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.