అధికారంలోకి వచ్చాక దేశానికి 'ఎక్స్ రే' తీస్తాం
దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంఐఎం లోపాయికారీగా మేలు చేస్తోందని విమర్శించారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని.. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తోందని అన్నారు రాహుల్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు బస్సు యాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. పెద్దపల్లి జిల్లా మంథనిలో.. రాష్ట్ర నేతలతో కలసి రాహుల్ బస్సు యాత్ర చేపట్టారు. పనిలో పనిగా లోక్ సభ ఎన్నికల వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. ఈ సారి దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అధికారంలోకి వచ్చాక కులగణన వెంటనే చేపడతామన్నారు.
LIVE:కాంగ్రెస్ విజయభేరి యాత్ర Corner meeting || మంథని || #rahulgandhi #congress https://t.co/nGF4n8Ddz6
— Revanth Reddy (@revanth_anumula) October 19, 2023
దేశానికి ఎక్స్ రే అవసరం..
కులగణన ఆవశ్యకత గురించి చెబుతూ దేశానికి 'ఎక్స్ రే' అవసరం అని చెప్పారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ లో ఓబీసీ జనాభా ఎంత అని నిలదీసింది తానేనని గుర్తు చేశారాయన. దేశాన్ని 90 మంది అధికారులు పరిపాలిస్తున్నారని, అందులో ఓబీసీలు కేవలం ముగ్గురేనని చెప్పారు. అందుకే దేశానికి ఎక్స్ రే అవసరమని చెప్పారు. డాక్టర్ దగ్గరకు వెళ్లగానే వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్ రే తీయించమంటారని, దేశానికి కూడా అలాగే ఎక్స్ రే తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్స్ రే అంటే కులగణన అని చెప్పారు రాహుల్ గాంధీ. తమ ప్రభుత్వం రాగానే ముందుగా ఎక్స్‌రే (కులగణన) తీయించే పని చేస్తామన్నారు.
"బీజేపీతో పోరాడుతున్నానని నా డీఎన్‌ఏ నిరంతరం నాకు గుర్తు చేస్తుంది" అని చెప్పారు రాహుల్ గాంధీ. బీజేపీకి మద్దతు ఇచ్చే వారు తనపై విమర్శలు గుప్పిస్తుంటే తన పోరాటం సవ్యంగా సాగుతోందని అర్థం అవుతోందన్నారు రాహుల్. అది తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని, కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజల పాలన తెస్తామని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. అంతా ఒకటేనని చెప్పారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంఐఎం లోపాయికారీగా మేలు చేస్తోందని విమర్శించారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని.. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తోందని అన్నారు రాహుల్.