నేటి నుంచి తెలంగాణలో.. రాహుల్ 'భారత్ జోడో యాత్ర'
దీపావళి పండుగ నేపథ్యంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి తిరగి వచ్చి ఈ నెల 27 నుంచి తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రసేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ 'భారత్ జోడో యాత్ర' కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి తెలంగాణలోకి అడుగు పెట్టనుంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో రాహుల్ యాత్ర నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్‌పోస్ట్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనున్నది. అయితే పాదయాత్ర తెలంగాణలో ఇవ్వాళ కేవలం గంట సేపు మాత్రమే కొనసాగనున్నది. 11 గంటల సమయంలో టైరోడ్‌లో యాత్ర ముగించి రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లనున్నారు.
దీపావళి పండుగ నేపథ్యంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి తిరగి వచ్చి ఈ నెల 27 నుంచి తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తారు. రాష్ట్రంలో 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనున్నది. రోజుకు సగటున పాతిక కిలోమీటర్లు రాహుల్ నడిచేలా రూట్ మ్యాప్ సిద్ధంచేశారు. సాయంత్రం వేళల్లో ప్రజలతో మమేకం కావడంతో పాటు.. కార్నర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. రాహుల్ పాదయాత్ర తొలి సారి ఓ మెట్రో నగరం గుండా సాగనున్నది. నవంబర్ 1,2న రాహుల్ హైదరాబాద్‌లోని ప్రధాన రహదారిపై నడక కొనసాగించనున్నారు. ఒక రోజు రాత్రి నగరంలోనే ఉంటారు. నవంబర్ 7న జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం శాఖాపూర్ వద్ద రాహుల్ పాదయాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించనున్నది.
రాష్ట్రంలో రాహుల్ యాత్ర విజయవంతం చేయడానికి ఇప్పటికే టీపీసీసీ 13 కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, వినోద్, ప్రసాద్ కుమార్, మహేశ్వర్ రెడ్డి, జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యే సీతక్క, పొన్నం ప్రభాకర్, టి. రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీలు పని చేయనున్నాయి. ఈ కమిటీల ఆమోదం మేరకు ప్రతీ రోజు కార్నర్ మీటింగ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. గుమ్మళ్ల, మన్యంకొండ, జడ్చర్ల క్రాస్, అన్నారం గేట్, పెద్దషాపూర్ క్రాస్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు, ముత్తంగి, శివ్వంపేట, పెద్దాపూర్, మహదేవ్‌పల్లి, శాఖాపూర్‌లలో కార్నర్ మీటింగ్స్ జరుగనున్నాయి.మొత్తం 7 జిల్లాలు, 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగ రాహుల్ జోడో యాత్ర కొనసాగనున్నది.
ఇప్పటికే రాహుల్ యాత్రకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ అభ్యర్థిన మేరకు తెలంగాణ పోలీస్ కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది. మునుగోడు ఉపఎన్నికకు ఈ యాత్ర ఉపయోగపడేలా ప్లాన్ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. యాత్ర తెలంగాణలో ముగిసే సరికి మునుగోడు ఫలితం కూడా రానుండటం గమనార్హం.