Telugu Global
Telangana

మేం కాదు.. మేం కాదు.. దాడి ఘటనపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్

కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరం అన్నారు రఘునందన్ రావు. దాడిని ఖండిస్తున్నామంటూ ట్వీట్ వేశారు రేవంత్ రెడ్డి.

మేం కాదు.. మేం కాదు.. దాడి ఘటనపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్
X

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తెలంగాణలో సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరగడం మరింత కలకలం రేపింది. ఇది ప్రత్యర్థి వర్గాల కుట్రేనని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ గూండాలపనేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. థర్డ్ రేట్ క్రిమినల్ అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు స్థానం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎంపీపై జరిగిన దాడిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని సూచించారు. దాడిని ఖండిస్తున్నామంటూ ట్వీట్ వేశారు రేవంత్ రెడ్డి.

ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున పోటీకి సిద్ధమయ్యారు. దుబ్బాకలో ఆయన ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దీంతో సహజంగానే రఘునందన్ రావుపై అనుమానాలు మొదలయ్యాయి. ఆయనే ఈ పని చేసి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై రఘునందన్ రావు కూడా స్పందించారు. ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్టేట్ మెంట్ ఇచ్చారాయన.

కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరం అన్నారు రఘునందన్ రావు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్‌ రిపోర్టర్‌ అని వెబ్‌ సైట్‌ కథనాల్లో ఉందని, అయితే నిందితుడు రాజు కాంగ్రెస్‌ నేతలతో ఉన్న ఫొటోలు కొన్ని ఫేస్ బుక్ లో కనపడుతున్నాయని చెప్పారు. నిందితుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది పోలీసులు స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదన్నారు. తనపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రఘునందన్ రావు. దాడి తర్వాత బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని, ఇది న్యాయం కాదని అన్నారు. తప్పు చేసిన వాళ్లు బీజేపీ కార్యకర్తలైతే తానే తీసుకొచ్చి అప్పగిస్తానన్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు రఘునందన్ రావు.


First Published:  30 Oct 2023 8:24 PM IST
Next Story