నచ్చినన్ని రోజులే పనిచేస్తా.. కాక రేపుతున్న రఘునందన్ వ్యాఖ్యలు
తాజా ఇంటర్వ్యూలో రఘునందన్ రావు తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. తాను ఎక్కడైనా నచ్చినన్ని రోజులే పనిచేస్తానని కుండబద్దలు కొట్టారు. తన మనసు గాయపడినా, తనకు ఆటంకం కలిగించినా, తన గౌరవానికి భంగం కలిగినా.. తాను అక్కడ ఉండలేనన్నారు.
తెలంగాణ బీజేపీ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ హాట్ గా ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్న వేళ... ఈటల, కోమటిరెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఈటల పదే పదే ఈ వార్తల్ని ఖండిస్తున్నారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంకా ముభావంగానే ఉన్నారు. ఈ మధ్యలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవహారం మాత్రం కాస్త గందరగోళంగా మారింది. రఘునందన్ పుల్లవిరుపు మాటలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో రఘునందన్ రావు తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. తాను ఎక్కడైనా నచ్చినన్ని రోజులే పనిచేస్తానంటూ కుండబద్దలు కొట్టారు. తన మనసు గాయపడినా, తనకు ఆటంకం కలిగించినా, తన గౌరవానికి భంగం కలిగినా.. తాను అక్కడ ఉండలేనన్నారు. బీజేపీలో ఉక్కపోత ఎక్కువైందని ఆయన చెప్పకనే చెప్పారు.
తనకు మాలిన ధర్మం..
ప్రస్తుతం పార్టీలో రఘునందన్ రావు కేవలం ఎమ్మెల్యే. ఈటల లాగా ఆయనకు ఇతర బాధ్యతలేవీ లేవు. తాను ఉత్సాహంగా ఉన్నా, ముందువరుసలో ఉండాలనుకుంటున్నా తనకు పార్టీ బాధ్యత అప్పగించాలని చెప్పుకొచ్చారు రఘునందన్ రావు. తనకై తాను బాధ్యతలు తీసుకోలేనని తేల్చి చెప్పారు. పార్టీ బాధ్యత ఇస్తే చేస్తా, లేకపోతే దుబ్బాకకే పరిమితమవుతానని అన్నారు. తనకు మాలిన ధర్మం తనకు కుదరదని కుండబద్దలు కొట్టారు రఘునందన్ రావు.
దుబ్బాక గెలుపు తర్వాత కొన్నిరోజులు రఘునందన్ రావుని పార్టీ ఆకాశానికెత్తేసింది, కానీ ఆ తర్వాత బండి వ్యూహాల ముందు ఆయన నిలబడలేకపోయారు. ఈటల రాకతో రఘునందన్ రావు ప్రాధాన్యత మరింతగా తగ్గింది. దీంతో ఆయన మాటల్లో అసంతృప్తి బయటపడింది. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే రఘునందన్ రావు ఇలా బయటపడ్డారా, లేక పార్టీ మారతారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.