Telugu Global
Telangana

భువనగిరి టికెట్ కోసం నేతల క్యూ.. వలస నేతలకు ఇవ్వొద్దని నాయకుల ఒత్తిడి!

భువనగిరి కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేసి బీఆర్ఎస్‌లో చేరారు.

భువనగిరి టికెట్ కోసం నేతల క్యూ.. వలస నేతలకు ఇవ్వొద్దని నాయకుల ఒత్తిడి!
X

కాంగ్రెస్‌లో టికెల్ లొల్లి పెరుగుతోంది. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామనే అంచనాలు ఉండటంతో.. ఆశావహుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. వలస నాయకులకు రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుండటంపై కూడా అసంతృప్తి రాజేస్తోంది. భువనగిరి అసెంబ్లీ టికెట్ కోసం భారీగా నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి.. అదనంగా వలస నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తుండటంతో వర్గాలుగా విడిపోయారు.

భువనగిరి కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆ స్థానంపై పంజాల రామాంజనేయులు ఆశ పెట్టుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఆంజనేయులుకు టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇతర కీలక నేతలు పోత్నక్ ప్రమోద్ కుమార్, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, తంగేళ్లపల్లి రవి కుమార్ కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి భువనగిరి కాంగ్రెస్ బలోపేతానికి ఎంతగానో పని చేశామని.. ఇప్పటికైనా తమకు టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఇటీవలే తెలంగాణ ఉద్యమకారుడు జిల్లా బాలకృష్ణారెడ్డి బీజేపీని వీడి బయటకు వచ్చారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జిట్టా.. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక 2018లో యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే రేవంత్ రెడ్డిని కలిసిన జిట్టా.. తనకు టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని చెప్పినట్లు తెలుస్తున్నది. ఇక బీఆర్ఎస్‌లో ఉన్న చింతల వెంకటేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికే ఈ సారి కూడా టికెట్ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న చింతల పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా కాంగ్రెస్ తరపున టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, భువనగిరి టికెట్ కోసం వలస నేతలు ఒక్కసారిగా ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. టికెట్ కోసం పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తే సహకరించబోమని చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారికే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే రామాంజనేయ గౌడ్ ఎంపీ కోమటిరెడ్డిని కలిసినట్లు తెలుస్తున్నది. తనకు టికెట్ ఇప్పించాలని.. వలస నేతలకు మాత్రం ఇవ్వొద్దని చెప్పినట్లు సమాచారం. కోమటిరెడ్డి కూడా తన వర్గం నాయకులకే టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అసలు అలక మీద ఉన్న కోమటిరెడ్డి ఇప్పుడు భువనగిరి టికెట్ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఇది కూడా ఇవ్వకపోతే అసమ్మతి పెరిగిపోతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

కాగా కోమటిరెడ్డిని ప్రసన్నం చేసుకునే వారికి టికెట్ వస్తుందనే అంచనాలతో పలువురు ఇతర నాయకులు కూడా ఆయనను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. భువనగిరి టికెట్ ఎలాగైనా తమకే ఇప్పించాలని కోరుతున్నారు. ఇక జిట్టా, చింతల చేరికలపై కూడా కోమటిరెడ్డిని రాష్ట్ర నాయకత్వం సంప్రదించినట్లు తెలుస్తున్నది. వాళ్లు చేరడం ద్వారా భువనగిరిలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని చెప్పినట్లు సమాచారం. అయితే, వారికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఓకే.. కానీ టికెట్ ఇస్తామనే హామీతో పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు వలస నేతల కారణంగా భువనగిరి కాంగ్రెస్‌లో కీలక నేతలకు టికెట్ దూరమవుతుందనే ఆందోళన నెలకొన్నది.

First Published:  13 Sept 2023 9:29 AM IST
Next Story