Telugu Global
Telangana

తెలంగాణకు కన్నడ నేతల క్యూ.. కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌.!

తెలంగాణలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో కర్ణాటక మంత్రులు దినేష్‌ గుండూరావు, ప్రియాంక్ ఖర్గే, ఎంసీ సుధాకర్, ఎస్పీ పాటిల్, కెహెచ్‌ మునియప్ప, కృష్ణ బైరెగౌడ, శివరాజ్‌ ఎస్‌ తంగదగి, జమీర్ అహ్మద్‌ఖాన్‌, ఈశ్వర ఖండ్రే, బి.నాగేంద్ర ఉన్నారు.

తెలంగాణకు కన్నడ నేతల క్యూ.. కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌.!
X

కర్ణాటక గెలుపుతో జోష్‌ మీదున్న కాంగ్రెస్‌.. తెలంగాణలోనూ అదే సీన్‌ రిపీట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి కన్నడ నేతలను దింపుతోంది. 10 మంది కర్ణాటక మంత్రులతో పాటు 48 మంది సీనియర్ నేతలకు తెలంగాణ ఎన్నికల బాధ్యతను అప్పగించింది.

కర్ణాటకకు చెందిన 10 మంది మంత్రులను AICC క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. 48 మంది ఇతర సీనియర్ నేతలను అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించింది. ఇందులో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌ ఇప్పటికే విడతల వారీగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది మేలో కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లకే పరిమితం కాగా.. జేడీఎస్‌ 19 సీట్లు సాధించింది.

తెలంగాణలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో కర్ణాటక మంత్రులు దినేష్‌ గుండూరావు, ప్రియాంక్ ఖర్గే, ఎంసీ సుధాకర్, ఎస్పీ పాటిల్, కెహెచ్‌ మునియప్ప, కృష్ణ బైరెగౌడ, శివరాజ్‌ ఎస్‌ తంగదగి, జమీర్ అహ్మద్‌ఖాన్‌, ఈశ్వర ఖండ్రే, బి.నాగేంద్ర ఉన్నారు.

మరోవైపు కర్ణాటక సీఎం, మంత్రులను తెలంగాణ ఎన్నికల కోసం ఉపయోగించుకోవడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. ప్రస్తుతం కర్ణాటక తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం, డిప్యూటీ సీఎం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. తెలంగాణలో ఎన్నికల కోసం కర్ణాటక ప్రభుత్వం ఏటీఎంలా పని చేస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

First Published:  11 Nov 2023 8:36 AM IST
Next Story