Telugu Global
Telangana

క్యూఆర్ కోడ్ మోసాలు.. చిరు వ్యాపారులు బలి

స్కాన్ చేసి డబ్బులు వేయగానే చాలామంది మెసేజ్ చూపించాలని అడుగుతారు. వ్యాపారంలో బిజీగా ఉన్న సమయంలో కస్టమర్లు నమ్మకస్తులే కదా, అదే ఊరివారు కదా అని చాలామంది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలే మోసగాళ్లకు ఆదాయ వనరుగా మారాయి.

క్యూఆర్ కోడ్ మోసాలు.. చిరు వ్యాపారులు బలి
X

కిరాణా కొట్టు వ్యాపారం అతనిది. రోజూ ఎంతోమంది కస్టమర్లు వస్తుంటారు. దాదాపుగా అందరూ తెలిసినవారే. షాపులో నాలుగైదు క్యూఆర్ కోడ్ బోర్డ్ లు ఉంటాయి. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ. రెండు రోజులుగా కస్టమర్లు స్కాన్ చేసి వేసే డబ్బులు ఆయన ఖాతాకు రావడంలేదు. కస్టమర్ల విషయంలో ఎలాంటి మోసం లేదు, ఆరా తీస్తే అది క్యూఆర్ కోడ్ మోసం అని తేలింది. లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు బాధిత వ్యాపారి. హైదరాబాద్ లో ఇలాంటి మోసాలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని ఓ రెస్టారెంట్ వ్యాపారి వారం రోజుల వ్యవధిలో 40వేల రూపాయలు నష్టపోయాడు.

నకిలో కోడ్ లు..

క్యూఆర్ కోడ్ బోర్డ్ లు ఇవ్వడానికి బ్యాంకు, లేదా సంంబంధిత యూపీఐ సిబ్బంది షాపులకు వస్తుంటారు. షాపు యజమాని బ్యాంకు వివరాలు తీసుకుని క్యూఆర్ కోడ్ బోర్డ్ లను ఇస్తారు. ఇటీవల ఇలాంటి కోడ్ లు ఇచ్చేందుకు వచ్చేవారు మోసాలకు పాల్పడుతున్నారు. కోడ్ తో వారి బ్యాంకు ఖాతాలను లింక్ చేసుకుంటున్నారు. దీంతో స్కాన్ చేసే సొమ్మంతా వ్యాపారులకు చేరకుండా మోసగాళ్ల ఖాతాల్లో పడిపోతుంది.

స్కాన్ చేసి డబ్బులు వేయగానే చాలామంది మెసేజ్ చూపించాలని అడుగుతారు, లేదా తమ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసుకుంటారు. వ్యాపారంలో బిజీగా ఉన్న సమయంలో కస్టమర్లు నమ్మకస్తులే కదా, అదే ఊరివారు కదా అని చాలామంది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలే మోసగాళ్లకు ఆదాయ వనరుగా మారాయి. వ్యాపారులు పట్టించుకోకపోతే ఆ మోసాన్ని వెంటనే గ్రహించలేరు.

సౌండ్ సిస్టమ్ తప్పనిసరి..

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పడగానే సెల్ ఫోన్ కి మెసేజ్ వచ్చే లోపే.. మన అకౌంట్ లో జమ అయినట్టు సౌండ్ సిస్టమ్ లో అలర్ట్ వచ్చే పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని షాపుల్లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. షాపుల్లో ఒకటికి పది క్యూఆర్ కోడ్ లు స్టిక్కర్లు అంటించి పెట్టొద్దని, ఒకటే ఉంచుకోవాలని, అది కూడా తమ అధీనంలో ఉంచుకుని, కస్టమర్ అడిగినప్పుడు చూపెట్టాలని చెబుతున్నారు. కస్టమర్ నగదు బదిలీ చేసినా అకౌంట్ కి రాకపోతే వెంటనే బ్యాంకు సిబ్బందిని, లేదా తమని సంప్రదించాలని సూచిస్తున్నారు పోలీసులు.

First Published:  9 Oct 2023 8:02 AM IST
Next Story