Telugu Global
Telangana

ఓడిపోయినా మంత్రిని చేశారు కదా..? తుమ్మలకు పువ్వాడ కౌంటర్లు

వారి స్వార్ధ రాజకీయాల కోసం జిల్లాను బలి పెడదామనుకుంటే దానికి ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు పువ్వాడ. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని దానిని వెనుకకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు

ఓడిపోయినా మంత్రిని చేశారు కదా..? తుమ్మలకు పువ్వాడ కౌంటర్లు
X

తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల పేరెత్తకుండానే ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రాధాన్యతనిచ్చిందో గుర్తు చేశారు. ఓడిపోయినా కూడా పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారన్నారు. 76ఏళ్ల చరిత్రలో ఖమ్మంకు తొలిసారి మంత్రి పదవి ఇస్తే ఎందుకంత కడుపు నొప్పి అని ప్రశ్నించారు. కొందరికి కడుపు నొప్పి వస్తే, అందరికీ రావాలని భావిస్తున్నారని విమర్శించారు. వారి స్వార్ధ రాజకీయాల కోసం జిల్లాను బలి పెడదామనుకుంటే దానికి ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు పువ్వాడ. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందుందని దానిని వెనుకకు నెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్.

ఖమ్మంకు మంత్రి పదవి రావడం వల్లే రూపు రేఖలు మార్చగలిగామని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అది సాధ్యమైందన్నారు. వాక్ శుద్ధితోపాటు, లక్ష్య శుద్ధి ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుండేవారని, ఆయన బాటలోనే తాను నడుస్తూ ఖమ్మంను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని చెప్పారు. ఖమ్మం నెహ్రూనగర్‌ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి, తుమ్మలపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

నేను ఖమ్మంనే నమ్ముకుని ఉన్నా..

గతంలో తన తండ్రి, ఇప్పుడు తాను.. ఖమ్మంనే నమ్ముకుని ఉన్నామని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. కానీ కొందరు పక్క చూపులు చూస్తున్నారని, ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అంటూ వెళ్తున్నారని పరోక్షంగా తుమ్మలను ఎద్దేవా చేశారు. మొత్తమ్మీద పార్టీనుంచి వెళ్లిపోతున్న తుమ్మలను కాస్త ముందుగానే టార్గెట్ చేశారు మంత్రి అజయ్. పార్టీ ఆయనకు గౌరవం ఇచ్చి, సముచిత స్థానం కల్పించినా.. పార్టీకోసం నిలబడకుండా బయటకు వెళ్తున్నారని విమర్శించారు.

First Published:  3 Sept 2023 7:33 PM IST
Next Story