బయటకొస్తున్న కట్టలపాములు.. పంజాగుట్టలో 70లక్షలు సీజ్
మొత్తంగా ఇప్పటి వరకూ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 2.18 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. లక్ష రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక వేళ నోట్ల కట్టలు విచ్చలవిడిగా బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల తనిఖీలో 70లక్షల నగదు బయటపటింది. దీనికి సంబంధించిన రసీదు చూపించలేకపోవడంతో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. వాహనంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రావ్, వేములవంశీగా వారిని గుర్తించారు. వారికి నగదు సమకూర్చిన మరొక నిందితుడు మధు పరారీలో ఉన్నాడు. నిందితుడు కిషన్ రావ్ స్వస్థలం హుజూరాబాద్ కాగా, నిజాం కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నట్టు తేలింది. అతను ఏబీవీపీ అబిడ్స్ జోన్ ఇన్ చార్జిగా గతంలో పనిచేశాడు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే పోలీసులకు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. వారం రోజుల క్రితం నార్సింగి వద్ద కోటి రూపాయల నగదుని పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదుని మునుగోడులో ఉన్న కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డికి అందజేసేందుకు నిందితులు బయలుదేరినట్టు తేలింది. ఇటీవల అంతారం గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 5.6 లక్షలు సీజ్ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకూ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి 2.18 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. లక్ష రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వ్యవహారం బయటపడిన తర్వాత బీజేపీకి ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. దీంతో కేవలం నగదు పంపిణీ ద్వారానే ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే ఆయన ప్రచారానికి కూడా దూరంగా ఉంటూ డబ్బు పంపిణీపైనే ఆధారపడ్డారు. ఎన్నికల నాటికి ఈ ధన ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది.