నేడు హైదరాబాద్ కు పంజాబ్ సీఎం -కేసీఆర్ తో భేటీ
కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగిడిన నేపథ్యంలో భగవంత్‌సింగ్ మాన్ తో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరు జాతీయ రాజకీయాలపై చర్చలు జరపనున్నట్టు సమాచారం.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవుతారు. కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగిడిన నేపథ్యంలో భగవంత్‌సింగ్ మాన్ తో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరు జాతీయ రాజకీయాలపై చర్చలు జరపనున్నట్టు సమాచారం.
పంజాబ్ లో అనేక ఏళ్ళుగా పాతుకొని పోయిన కాంగ్రెస్, అకాళీదళ్ పార్టీలను మట్టి కరిపించి అధికారం హస్తగతం చేసుకున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. అదే విధంగా ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో 15 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది ఆప్. ఈ క్రమంలోనే గుజరాత్ లో కూడా 13 శాతం ఓట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు సాధించి జాతీయ పార్టీగా అవతరించి ఊపు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన ముఖ్యమంత్రితో, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యంగా బీఆరెస్ ఏర్పాటు చేసిన కేసీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నది.
కాగా మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించనున్న పెట్టుబడుల సమావేశంలో పంజాబ్ సీఎం పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 24న పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ కూడా హైదరాబాద్ రానున్నారు.